కాసుల కక్కుర్తితో దంపతులను విడతీసిన కార్పోరేట్ ఆసుపత్రి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ లో ప్రయివేట్ ఆసుపత్రి కాసుల కక్కుర్తి రోజు రోజుకు మితిమీరి పోతుంది.టెస్టుల పేరుతో ఇష్టా రీతిలో డబ్బులు దోచుకుంటూ

కాసుల కక్కుర్తితో దంపతులను విడతీసిన కార్పోరేట్ ఆసుపత్రి
X

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ లో ప్రయివేట్ ఆసుపత్రి కాసుల కక్కుర్తి రోజు రోజుకు మితిమీరి పోతుంది.టెస్టుల పేరుతో ఇష్టా రీతిలో డబ్బులు దోచుకుంటూ కార్పోరేట్ యాజమాన్యలు కోట్లకు పడగలు ఎత్తుతున్నాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ లోని ప్రయివేట్ ఆసుపత్రులు అమాయక ప్రజలకు లేని రోగాన్ని అంటగడుతు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీనా సంతాన సాఫల్య కేంద్రంలో తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన పచ్చని సంసారం లో నిప్పులు పోసింది. లేని రోగాన్ని ఉన్నట్లుగా చూయించి భర్త కు భార్యను దూరం చేసింది. ఈ ప్రయివేట్ ఆసుపత్రుల అక్రమాల్లో ఏంతో మంది బాధితులు చిక్కుకుంటున్న జిల్లా అధికార యత్రంగం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారించడం పలు విమర్శలకు తావిస్తుంది.

సంతానం కావాలని వెళ్తే.. కాలేయ రోగాన్ని అంటగట్టారు

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్దారం కి చెందిన రాజుకి పెళ్ళి అయి ఏనిమిది ఏళ్లు అయిన పిల్లలు పుట్టక పోవడంతో జిల్లా కేంద్రంలోని టీనా సంతాన సాఫల్య కేంద్రానికి భార్యతో కలిసి వెళ్ళాడు. భార్యకు అండాశయంలో సమస్యలు ఉన్నాయని చెప్పడం తో సుమారు 60 నుంచి 70 వేల వరకు ఖర్చు పెట్టాడు. అనంతం భార్యకు నయం అయింది అని తరువాత భర్తకు వివిధ టెస్టులు చేయాలంటూ 10 నుంచి 15 వేల వరకు వసూళ్ళు చేశారు. ఆ త‌రువాత HBSAG టెస్టు ని ఆసుపత్రిలోని ప్లాస్మా డయాగ్నోస్టిక్ లో 10నిమిషాల అయ్యే టెస్ట్ కి 10 రోజుల వరకు వేయిట్ చేయించి హైపటైటీస్ -బి పాజిటివ్ ఉందంటూ తప్పుడు రిపోర్ట్ ని తన భార్య చేతికి ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా భర్త లేకుండానే కేవలం అతని భార్యకు కౌన్సిలింగ్ చేసి భర్తకు దూరంగా ఉండాలంటూ టీనా ఆసుపత్రి వైద్యురాలు సూచించారు. ఆ తరువాత హైపటైటీస్ -బి రోగానికి సంబంధించి నివారణ వివరాలు భర్త రాజు అదే డాక్టర్ ని అడగగా సుమారు 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పి మందు లేని రోగాన్ని తగ్గిస్తామని డబ్బులు గుంజేందుకు ప్రయత్నించినట్లు బాధితుడు రాజు ఆరోపిస్తున్నాడు. లేని రోగం ఉంది అంటూ చూపడంతో తన భార్య తన వద్ద ఉండనంటూ వారి తల్లి గారి ఇంటికి వెళ్లి పోయింది అంటూ బాధితుడు వాపోతున్నాడు.

పలు డయాగ్నోస్టిక్ సెంటర్లలో పరిక్షలు

టీనా ఆసుపత్రి వ్యవహారం పై అనుమానం వచ్చిన భాధితుడు రాజు హైదరాబాద్ లో ని అపోలో ఆసుపత్రి, విజయ డయాగ్నోస్టిక్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో HBSAG పరిక్షలు చేయించుకోగా నేగిటీవ్ గా నిర్ధారణ అయింది. దీంతో జరిగిన వ్యవహారం పై బంధువులతో ఆసపత్రి వైద్యుల వద్దకు చేరి వారిని ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఇలాంటివి అన్ని మాములే జరుగుతుంటాయి అంటూ ఆసుపత్రి నిర్వాహకులు తాపిగా సమాధానం ఇచ్చారు. ఆసుపత్రి నిర్వాహకుల మాటాలను నిర‌సిస్తూ బంధువులు పలు ప్రజా సంఘాల నేతలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగింది అంటూ భాధితులు ఆరోపించారు.

పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు.. స్పందించ‌ని వైద్యారోగ్య శాఖ

మహబూబ్ నగర్ జిల్లా లో వైద్య ఆరోగ్య శాఖ ప్రయివేట్ ఆసుపత్రుల వ్యవహారంలో మెతక వైఖరిని అవలంబిస్తుంది అని పలువురు ఆరోపిస్తున్నారు. గత నెల రోజుల నుంచి తప్పుడు రిపోర్టుల కారణంగా తన సంసార జీవితం పాడైన‌ప్ప‌టికీ ప్రభుత్వ అధికారులు ఎవ్వ‌రూ కూడా పట్టించుకోవడం లేదని ప్రయివేట్ ఆసుపత్రిల అక్రమ వ్యవహారాలు బయటికి వస్తున్న చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల‌ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అంటూ భాధితులు ఆరోపించారు. టీనా ఆసుపత్రి వైద్యులపై భాదితుడు రాజు బంధువులు, ప్రజా సంఘల నేతలో కలిసి మహబూబ్ నగర్ టూటౌన్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Next Story