'కద్దు కీ ఖీర్' సేవించి 41 మందికి అస్వస్థత..

by Kodari Anjali |

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఒక ఇంట్లో తయారుచేసిన 'కద్ధు కీ ఖీర్' సేవించి 41 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు డిఎంహెచ్ఓ శ్రీనివాసులు తెలిపారు.

కద్దు కీ ఖీర్ సేవించి 41 మందికి అస్వస్థత..
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఒక ఇంట్లో తయారుచేసిన 'కద్ధు కీ ఖీర్' సేవించి 41 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు డిఎంహెచ్ఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మాట్లాడారు. స్థానిక న్యూ మోతీనగర్ లోని ఒక ఇంట్లో గురువారం జరిగిన వివాహం సందర్భంగా తయారు చేసిన 'కద్దు కీ ఖీర్' శుక్రవారం రాత్రి సేవించగా 41 మంది కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారని, ఇందులో 26 మంది పిల్లలు, ఒక గర్భిణీ శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు, మిగిలిన 14 గురు చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిస్చార్జ్ చేస్తామని వారు తెలిపారు. ఆయన వెంట డిఎంహెచ్ఓ డా.శశికాంత్ ఉన్నారు.

Next Story