16 రోజుల అన్వేషణ.. ఒకరి మృతదేహం వెలికితీత

by Malleboina Mahesh |

ప్రపంచంలోనే.. అతి పెద్ద టన్నెల్.. గా రూపొందుతున్న ఎస్ఎల్బీసీ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్యం అయ్యింది.

16 రోజుల అన్వేషణ.. ఒకరి మృతదేహం వెలికితీత
X

దిశ, అచ్చంపేట: ప్రపంచంలోనే.. అతి పెద్ద టన్నెల్.. గా రూపొందుతున్న ఎస్ఎల్బీసీ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది లో ఆదివారం ఒకరి మృతదేహం లభ్యం అయ్యింది. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8 గంటలకు జరిగిన ప్రమాదంలో 44 మంది ఉద్యోగులు, కార్మికులు తప్పించుకొని ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన మరో 8 మంది ఉద్యోగులు, కార్మికులు ప్రమాదంలో చిక్కుకుపోయిన విషయం పాఠకులకు విదితమే.. టన్నెల్‌లో ఉన్న పరిస్థితులు ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించలేని విధంగా మారాయి. ఒకవైపు పెద్ద ఎత్తున ఉబికి వస్తున్న నీరు.. మరోవైపు .. దెబ్బతిని ఉన్న యంత్రాలు.. వాటి విడిభాగాలు.. అడుగు తీసి అడుగు వేయలేని విధంగా మారాయి.

దీంతో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు దేశంలో ప్రసిద్ధిగాంచిన రెస్క్యూ టీంలను రప్పించడం.. రాష్ట్ర మంత్రులు, అధికారులు అక్కడే ఉండి పనులను పరిశీలించడం జరుగుతూ వచ్చింది. ప్రమాదంలో చిక్కుకున్న వారి విషయంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదనలు కూడా జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇటు అధికారులు. అటు రెస్క్యూ టీంలు ఏమాత్రం అధైర్య పడకుండా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలీకృతం కావడం, ఒక మృతదేహం దొరకడం.. మిగతా వారి ఆచూకీ కూడా ఒకటి రెండు రోజుల్లో దొరికే అవకాశాలు ఉన్నాయనే నమ్మకంతో పనులు కొనసాగిస్తున్నారు.

పసిగట్టిన.. మాయా, మర్ఫీ..

సంఘటన జరిగిన రోజు నుంచి ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.. రకరకాల యంత్రాలు.. నిపుణులను రప్పించి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. చివరకు కేరళ నుంచి రప్పించిన బెల్జియం నీలో నైస్ జాతికి చెందిన మాయ, మర్ఫీ అనే రెండు కుక్కలను, 157 మంది రెస్క్యూ టీం, సాంకేతిక నిపుణులు గాలింపు కోసం ఆదివారం ఉదయం వెళ్లారు. మాయ, మర్ఫీలు మృతదేహాలు ఉన్న పలుచోట్లను గుర్తించగా, ఒకచోట రెస్క్యూ టీం బృందం మట్టిని తొలగించడంతో ఒక మృతదేహం బయటపడింది.

మిగతా మృతదేహాలు..

ఒక మృతదేహం యంత్రం సమీపంలో లభించడంతో మిగతా వారి మృతదేహాలు కూడా సమీపంలోనే ఉండవచ్చు అన్న అంచనాకు రెస్క్యూ టీం సభ్యులు వచ్చారు. మాయ, మర్ఫీ సేవలను సద్వినియోగ పరచుకుని మిగతా వారి ఆచూకీని కనుగొంటారని పలువురు అంటున్నారు.

రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా..

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ బాదావత్ సంతోష్ మీడియాకు వెల్లడించారు. మృతదేహాలు ఎవరివనే అంశంపై పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి, అ మృతదేహాలను, చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేస్తామని వారు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో మిగతా వారి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Next Story