- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహదేవునిపేటలో 111 బస్తాల నకిలీ డీఏపీ స్వాధీనం..
బిజినేపల్లి మండలంలో నకిలీ డీఏపీ నమూనాలను హైదరాబాద్ ప్రయోగశాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

దిశ, బిజినేపల్లి: నాగర్‌కర్నూలు జిల్లా, బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువులను రైతులు వినియోగించడం వ్యవసాయ అధికారులు గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతుల నుండి స్వాధీనం చేసుకున్న నకిలీ డిఏపీని పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్, రైతులకు తక్కువ ధరకు నకిలీ డీఏపీ ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయించి మోసానికి పాల్పడుతున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మికంగా గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ఇళ్లలో నిల్వ ఉంచిన మొత్తం 111 బస్తాల అనుమానాస్పద డీఏపీ ఎరువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇప్పటికే పంట పొలాల్లో వినియోగించిన 39 డీఏపీ ఖాళీ సంచులను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తులో భాగంగా భద్రపరిచారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను నరేందర్ రెడ్డి గ్రామంలో ఫెర్టిలైజర్ దుకాణదారుని ఇంటి వద్ద నిలిపి విచారిస్తూ , వాహనంలో భద్రపరచగా, విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న డీఏపీ బస్తాలను పరిశీలించి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నకిలీ ఎరువులు రైతుల చేతికి ఎలా చేరాయి, ఏ మార్గంలో సరఫరా జరిగిందనే అంశాలపై అధికారులతో చర్చించారు.
పరీక్షల నిమిత్తం..
ఈ సందర్భంగా గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మధు, కళ్యాణిలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహదేవునిపేట గ్రామానికి చెందిన పొలిమోని రాజు, నందిపేట బాలయ్య, దుగ్గని రాములు, బత్తుల రాములు, ఏ. ప్రవీణ్ కుమార్ రెడ్డి, జక్కా మన్యపు రెడ్డి, ఏ. జైపాల్ రెడ్డి అనే రైతులు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు 1600, 1700 వందల రూపాయలకు ఒక బస్తా చొప్పున విక్రయించడంతో వారి వద్ద నుంచి ఈ డీఏపీ ఎరువులను కొనుగోలు చేసినట్లు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, స్వాధీనం చేసుకున్న డీఏపీ బస్తాల నుంచి నమూనాలను సేకరించి వెంటనే హైదరాబాద్‌లోని గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా నివేదికలు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. నకిలీ ఎరువులుగా నిర్ధారణ అయితే బాధ్యులపై ఎరువుల నియంత్రణ చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సాధీనం చేసుకున్న నకిలీ డిఏపి ఎరువులను బిజినేపల్లి రైతు వేదికలో భద్రపరచాలని కలెక్టర్ వ్యవసాయ అధికారుల ఆదేశించారు. అదేవిధంగా ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
నకిలీ ఎరువుల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, ఏ ప్రాంతం నుంచి వాటిని తీసుకొచ్చారు, జిల్లాలో మరెక్కడైనా ఇలాంటి ఎరువులు విక్రయించారా అనే అంశాలను పూర్తిగా విచారించి సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత డీఎస్పీకి సూచించారు. అవసరమైతే ఇతర జిల్లాలు, కర్ణాటక రాష్ట్ర అధికారులతో కూడా సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ మాట్లాడుతూ... రైతులను మోసం చేసే నకిలీ ఎరువుల వ్యాపారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదన్నారు. రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులకు పలు సూచనలు చేశారు. ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలని సూచించారు.
ప్రత్యేక నిఘా కొనసాగుతుంది..
మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు విక్రయిస్తున్నారని నమ్మి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ రైతులను కోరారు. నకిలీ ఎరువుల వినియోగం వల్ల పంటల దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాసులు, నాగర్ కర్నూల్ సీఐ , సిఐ అశోక్ రెడ్డి, బిజినేపల్లి ఉప తహసిల్దార్ రవికుమార్, ఎస్ఐ షంషద్దీన్,ఇతర పోలీసు అధికారులు వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.






