- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డిస్కౌంట్’ పేరుతో అమాయకులకు గాలం.. క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!
సోషల్ మీడియాలో బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్ల పేరుతో సాగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బ్రాండెడ్ వస్తువు.. దానికి తోడు ఆన్‌లైన్‌లో మైండ్‌బ్లోయింగ్ డిస్కౌంట్.. మార్కెట్లో రూ. వేలకు దొరికే వస్తువు రూ.వందలకే వస్తుందనగానే క్షణం కూడా ఆలోచించకుండా బుక్ చేసేయాలనిపిస్తుంది. సరిగ్గా సామాన్యుల ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. తక్కువ ధరకు ఖరీదైన వస్తువలంటూ ఆశ చూపిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా ఫేక్ యాడ్స్ ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
నకిలీ వెబ్‌సైట్లు.. స్పాన్సర్డ్ ప్రకటనలు
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ఈ ఆన్‌లైన్ షాపింగ్ మోసాలకు తెరలేపుతున్నారు. పేరు మోసిన బ్రాండెడ్ షూస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన దుస్తులు, స్మార్ట్ గ్యాడ్జెట్లు, లగ్జరీ వస్తువులతోపాటు ఇన్సూరెన్స్ వంటి వాటిని సైతం భారీ డిస్కౌంట్లకు ఇస్తున్నట్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన స్పాన్సర్డ్ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ యాడ్స్ ను చూసి నిజమేనని నమ్మి వస్తువులను బుక్ చేస్తే.. డబ్బులు చెల్లించిన తర్వాత బాధితులకు ఎలాంటి వస్తువులూ రావడం లేదు. అంతేకాకుండా ఆ నకిలీ వెబ్‌సైట్లలో బాధితులు బుకింగ్ కోసం నమోదు చేసే వారి బ్యాంకింగ్, ఇతర వ్యక్తిగత వివరాలు క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ లు సైతం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. దీంతో భవిష్యత్తులో వారి ఖాతాలు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం సైతం పొంచి ఉంటున్నది.
ఎలా గుర్తుపట్టాలంటే..
కొన్ని సాధారణ సంకేతాలను గమనించడం ద్వారా ఈ ఆన్‌లైన్ షాపింగ్ మోసాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మార్కెట్ ధర కంటే ఊహించని స్థాయిలో అసాధారణమైన డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ పేరుతో వచ్చే ఆఫర్లను అస్సలు నమ్మొద్దు. ఇటువంటి నకిలీ వెబ్‌సైట్లలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఏమాత్రం ఉండదు. కేవలం అడ్వాన్స్ పేమెంట్ కోసమే వారు ఒత్తిడి చేస్తారు. ఆయా సోషల్ మీడియా పేజీల ఫాలోవర్లు చాలా తక్కువగా ఉండటం, పేజీ క్రియేట్ చేసి కొద్ది రోజులే కావడం, అనుమానాస్పదంగా ఉండే యూఆర్ఎల్ లింక్‌లు, నాసిరకంగా ఉండే వెబ్‌సైట్ డిజైన్‌ను చూసి ఫేక్ అని పసిగట్టవచ్చు. కస్టమర్లను నమ్మించేందుకు అందులో నకిలీ రివ్యూలు, ఎడిట్ చేసిన నకిలీ పేమెంట్ స్క్రీన్ షాట్లను కూడా నేరగాళ్లు ఉంచుతుండడం గమనార్హం.
ఒకటికి రెండు సార్లు ధ్రువీకరించుకోవాలి: శిఖా గోయల్, టీజీసీఎస్‌బీ డైరెక్టర్
భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే నకిలీ స్పాన్సర్డ్ యాడ్స్‌ను నమ్మి మోసపోవద్దు. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకొని డబ్బులు చెల్లించాలి. ముందుగా షాపింగ్ చేస్తున్న వెబ్‌సైట్ అడ్రస్ సరైనదేనా అని జాగ్రత్తగా పరిశీలించాలి. అసలు ధరలతో పోల్చి చూసుకోవాలి. సోషల్ మీడియా పేజీ హిస్టరీ, ఫాలోవర్ల సంఖ్యను సైతం చెక్ చేయాలి. బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్ లు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఒకవేళ నకిలీ యాడ్స్ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌కు కాల్, లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ అయినట్లు గుర్తిస్తే.. తక్షణమే సదరు బ్యాంకు అధికారులకు లేదా సంబంధిత పేమెంట్ యాప్ నిర్వాహకులకు సమాచారం అందించాలి.






