మేడిగడ్డ రిపేరుకు ముందుకు రాని ఎల్అండ్‌టీ

by Malleboina Mahesh |

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల అంశంలో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్మాణ సంస్థ అయిన ఎల్అండ్‌టీ సంస్థనే కారణమని విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ రిపోర్టులో తేల్చాయి.

మేడిగడ్డ రిపేరుకు ముందుకు రాని ఎల్అండ్‌టీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల అంశంలో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్మాణ సంస్థ అయిన ఎల్అండ్‌టీ సంస్థనే కారణమని విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ రిపోర్టులో తేల్చాయి. దాంతో.. ఆ బ్యారేజీలకు నిర్మాణ సంస్థనే రిపేరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పలు నోటీసులు సైతం పంపించింది. కానీ.. మరమ్మతుల విషయంలో నిర్మాణ సంస్థ నుంచి ఉలుకు పలుకు లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నది. మరోసారి నోటీసులు పంపించి వివరణ కోరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడు కూడా స్పందించకుంటే నిర్మాణ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ మీద క్రిమినల్ ప్రొసీజర్ చేపట్టేందుకు సిద్ధం అవుతున్నది.

2019లోనే లోపాలు వెలుగులోకి..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎల్అండ్‌టీ సంస్థ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను నిర్మించింది. 2018లో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. దానిని 2019 మే నెలలోనే ప్రారంభించారు. అయితే.. ప్రారంభించిన ఏడాదిలోపే మేడిగడ్డలోని లోపాలు వెలుగుచూశాయి. అదే ఏడాది నవంబర్‌లో వరదల కారణంగా గేట్లు క్లోజ్ చేయగా.. బ్యారేజీలోనే పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో పెద్దగా సీరియస్‌గా పరిగణించలేదు. ఆ తదుపరి డిసెంబర్‌లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తదనంతరం అధికారాన్ని చేపట్టింది. మేడిగడ్డ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే దాని మీద విచారణ చేపట్టింది. అటు విజిలెన్స్ విచారణ చేపట్టడంతోపాటే కేంద్ర విభాగమైన ఎన్‌డీఎస్ఏ ఎంక్వయిరీని సైతం కోరింది. దాంతో ఇరు సంస్థలు కూడా నిర్మాణంలోని లోపాలను ఎత్తిచూపాయి.

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని నిర్మాణ సంస్థ

నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని తేల్చడంతో.. దాని మరమ్మతులను నిర్మాణ సంస్థనే చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యతలను స్వీకరించాలని ప్రభుత్వం పలుమార్లు కోరింది. అయితే.. ఈ విషయమై నిర్మాణ సంస్థ నుంచి సరైన స్పందన రాలేదు. తమ తప్పేమీ లేదని వాదిస్తూ, మరమ్మతులకు ముందుకు రాలేదు. డిజైన్ లోపాలు, నాణ్యత లేని నిర్మాణం వల్లనే బ్యారేజీ దెబ్బతిన్నదని నివేదికలు చెబుతున్నా.. కంపెనీ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా.. మేడిగడ్డ పై విచారణ కోసం నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్ సైతం నిర్మాణ సంస్థ లోపాలను ఎత్తి చూపింది. నిర్లక్ష్యమే కాకుండా, కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తున్నది.

తగ్గేదేలే అంటున్న ప్రభుత్వం

ప్రజల సొమ్ముతో నిర్మించిన ఇంతటి భారీ ప్రాజెక్టు నిరుపయోగంగా మారడానికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి రెండేళ్లలోపు ఎలాంటి లోపాలు వెలుగుచూసిన.. వాటిని సరి చేయడం, మరమ్మతులు చేసే బాధ్యత నిర్మాణ సంస్థదే ఉంటుంది. కాగా.. 2019, 2020 ఫిబ్రవరి, మే నెలల్లోనే లోపాలు గుర్తించినా కంపెనీ సరి చేయలేదు. అంతేకాకుండా బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లుగా నిర్మాణ సంస్థ సర్టిఫికెట్లు పొందినట్లు ప్రభుత్వం గురించింది. దాంతో ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. కాంట్రాక్ట్ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం నిర్మాణ సంస్థ నడుచుకోవాల్సిందేనని ఇప్పటికే తేల్చిచెప్పింది. అయినా.. వాటిని పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వచ్చింది.

చట్టపరమైన చర్యలకు సిద్ధం

నిర్మాణ సంస్థ నుంచి సరైన సమాధానం రాకపోవడం.. నిర్లక్ష్యం కనిపిస్తుండడంతో చట్టపరమైన చర్యల కోసం ఇప్పటికే ప్రభుత్వం న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరింది. అయితే.. క్రిమినల్ కేసు పెట్టేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయని న్యాయశాఖ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దాంతో దేశంలోనే దిగ్గజ కంపెనీ అయిన ఎల్అండ్‌టీపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నేరుగా కేసు నమోదు చేయడానికంటే ముందు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. బ్యారేజీ వైఫల్యాల నేపథ్యంలో కంపెనీపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపనున్నారు.

ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. అయితే.. వీటన్నింటి నేపథ్యంలో మేడిగడ్డ భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాకాలం పూర్తవ్వడంతో ఇప్పటికే రిపేరు పనులు ప్రారంభిస్తే వచ్చే సీజన్ నాటికి బ్యారేజీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండేవి. అయితే.. ఇంకా నిర్మాణ సంస్థనే రిపేరు కోసం ముందుకు రాకపోవడం.. ఆ ప్రాసెస్ మరింత ఆలస్యం అవుతుండడంతో మరమ్మతు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.

Next Story