LRS: ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తులపై సర్కార్ ఫోకస్.. టార్గెట్ రూ.1,500 కోట్లు

by Shiva |   ( Updated:2025-01-24 01:41:51.0  )
LRS: ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తులపై సర్కార్ ఫోకస్.. టార్గెట్ రూ.1,500 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నత్తనడకన సాగుతున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఆదాయం సమకూర్చే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రాధాన్యతగా భావించి చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు హెడ్ ఆఫీసు నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 90 వేల దరఖాస్తులను పరిష్కరించారు. వీటి ద్వారా ఇప్పటి వరకు పురపాలక శాఖకు రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి 31 వరకు దరఖాస్తులను పరిష్కరించాలని ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు మార్చి 31 తర్వాత అన్ని రకాల ఫీజులు పెరిగే అవకాశముందని సమాచారం.

‘ఎల్ఆర్ఎస్‌’తో ఇన్‌కమ్ సమకూర్చుకోవాలని డెసిషన్

రాష్ట్రంలో 143 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 129 మున్సిపాలిటీలు, 14 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ మినహాయిస్తే 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 14.36 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఉన్నాయి. వీటిని పరిష్కరించి రూ.1,500 కోట్ల ఇన్‌కమ్‌ను సమకూర్చుకోవాలని పురపాలక శాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,991, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో 50,411, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 47,506, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో 42,231, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 39,944, నల్లగొండ మున్సిపాలిటీలో 36,116, సూర్యాపేటలో 35,464 దరఖాస్తులు వచ్చాయి.

స్పందన నామమాత్రమే

అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 2.95 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 17,157 అప్లికేషన్లను పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఆఫీసర్లు పరిశీలించిన తర్వాత ఫీజు చెల్లించాలని సమాచారం పంపించారు. కానీ 3,171 మంది మాత్రమే స్పందించారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకు రూ.30.71 కోట్ల ఆదాయం వచ్చింది. 129 మున్సిపాలిటీల్లో 11.37లక్షల దరఖాస్తులు ఉన్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.69.29 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిల్లో 1.16 లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేయడంతో పాటు ఫీజు చెల్లించాలని అధికారులు సమాచారం పంపించారు. వీరిలో 9,880 మంది మాత్రమే తమ ఫీజు చెల్లించారు.

ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో పురపాలక, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలొస్తాయి. వీటిలో ఇరిగేషన్ శాఖ కీలకంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలైనా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, ఓటర్ల జాబితాలు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వేతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై పురపాలక, రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి పెట్టలేకపోయారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు అలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్‌ జోన్లను పరిశీలించాల్సిన బాధ్యత ఇరగేషన్ అధికారులపైనే ఉంది. ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పరిశీలించిన తర్వాత ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతోపాటు ప్రభుత్వ భూములు, లేఅవుట్లలోని ఓపెన్ స్పేస్ వంటి వేలాది దరఖాస్తులను తిరస్కరించినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

సర్కారు ప్రధాన ఆదాయ వనరుగా ఎల్ఆర్ఎస్

ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్ర సర్కారు వనరులను అన్వేషిస్తోంది. అందులో ప్రధాన వనరు ఎల్ఆర్ఎస్ కాగా, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను మార్చి31లోగా పరిష్కరించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కసరత్తు చేస్తోంది. దీంతో పాటు మార్చి31 తర్వాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన అన్ని రకాల ఫీజులు పెరిగే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed