ఎక్సైజ్ జీవోలో లొసుగులు.. ఏరులై పారుతోన్న నాన్ డ్యూటీ లిక్కర్

by Naga Rani Yarlagadda |

చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు తెలుపుతున్నా.. అక్రమ మద్యం మాత్రం రాష్ర్టంలోకి పారుతూనే ఉంది.

ఎక్సైజ్ జీవోలో లొసుగులు.. ఏరులై పారుతోన్న నాన్ డ్యూటీ లిక్కర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు తెలుపుతున్నా.. అక్రమ మద్యం మాత్రం రాష్ట్రంలోకి పారుతూనే ఉంది. గోవా, ఢిల్లీ, హర్యానా ప్రాంతాల నుంచి హైదారాబాద్‌కు వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టడంలో ఎన్ని దాడులు నిర్వహించినా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో ప్రతిసారీ పదుల నుంచి వందల సంఖ్యలో మద్యం బాటిళ్లతో పట్టుబడుతున్నారు. రాష్ట్రం ఎక్సైజ్ శాఖ జీవోల్లో ఉన్న లోపాలతో అక్రమ మద్యం రాష్ట్రంలోకి పారుతుందని వైన్స్ అసోసియేన్ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధిచిన మద్యం వందల రూపాయల మద్యం బాటిళ్లు అమ్మకాలు జరుగుతుంటే పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే మద్యం బాటిళ్లు వేల రూపాయలు పలుకుతున్నాయి. 2023, 2024 సంవత్సరాల్లో పట్టుకున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌లో చాలా వ్యత్యాసం ఉందని, ఇది ఎక్సైజ్ అధికారుల నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. గత సంవత్సర కాలంలో అక్రమంగా వచ్చిన వేల లీటర్ల విదేశీ మద్యం, ఇతర రాష్ట్రాల మద్యం రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయాన్ని గండి కొట్టాయని మద్యం వ్యాపారులు చెబుతున్నారు.

రూ.300 కోట్లకు ఆదాయానికి పైగా గండి..

ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతో ఆదాయానికి భారీగానే గండి పడినట్లవుతుందని స్థానిక వైన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంతో సుమారు రూ.300 కోట్లకు పైగా ఎక్సైజ్ ఆదాయానికి గండి పడుతుందని తెలుపుతున్నారు. నాన్ డ్యూటీ పెయిట్ లిక్కర్ ( ఎన్‌డీపీఎల్‌)కు సంబంధించి 2023 సంవత్సరంలో 30వేల లీటర్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 2024 సంవత్సరంలో 11వేల లీటర్ల మద్యం మాత్రమే పట్టుబడింది. గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి వచ్చే మద్యాన్ని కట్టడి చేయడంలో విఫలం చెందుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. రోజూ వందల సంఖ్యలో విలువైన మద్యం బాటిళ్లు నగరానికి చేరుతున్నాయి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో ఆదాయానికి గండి పడుతున్నా ఎక్సైజ్‌ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు.

ఎన్‌డీపీఎల్‌ మద్యంలో ఎక్సైజ్ శాఖ మౌనం..

కోట్ల రూపాయల విలువైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ( ఎన్‌డీపీఎల్‌) మద్యం రాష్ట్రంలోకి వస్తున్నా ఎక్సైజ్‌ శాఖ మౌనం వహించడానికి కారణాలేంటి ? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు దాడులు ఎందుకు నిలిపి వేశారు..? చెక్‌పోస్టులు ఎందుకు నిర్వీర్యంగా మారాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంలో స్థానిక మద్యం వ్యాపారులు ఎక్సైజ్‌ శాఖ సిబ్బందిని అడిగితే.. ఈ ప్రశ్నలకు ఉన్నతాధికారులే సమాధానం చెబుతారంటూ తప్పించుకుంటున్నారు. తెలంగాణ ఎక్సైజ్‌శాఖ జీవోలలోని లొసుగులను అధారంగా చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా బడా బాబులు యేడాదికి రూ. 300 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర మద్యాన్ని రాష్ట్రంలోకి దిగుమతి చేసుకొని లాభాలు గడిస్తున్నారనే మద్యం వ్యాపారులు వాపోతున్నారు.

జీవోలోని లొసుగుచట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు తెలుపుతున్నా.. అక్రమ మద్యం మాత్రం రాష్ర్టంలోకి పారుతూనే ఉంది.లతో..

రాష్ట్రంలో జీవోఎంఎస్‌ 72 ప్రకారం ప్రతి వ్యక్తి 6 బాటిళ్లు కలిగి ఉండవచ్చు అని ఉంది. కానీ ఇవి తెలంగాణ టీజీబీసీఎల్‌ మద్యం బాటిళ్లుగా ఉండాలని జీవోలో లేదు. దీన్ని అసరాగా చేసుకొని చాలా మంది నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్లను ఇతర ప్రాంతాల నుంచి సొంత అవసరాల ముసుగులో తీసుకొని అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తున్నది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో విదేశాల నుంచి వచ్చే వారి టికెట్లను తీసుకొని వాటిపై డ్యూటీ ప్రీ మద్యం దుకాణాల్లో ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఆరుబయట అమ్మకాలు సాగిస్తున్నారు.

రాయల్ సెల్యూట్ శ్రీలంకలో రూ.12 వేలు, తెలంగాణలో రూ.25వేలు..

ఆక్రమ మద్యం అమ్మకం ముఠా ఈ మధ్య మరో ముందడుగు వేసి విదేశాలను నుంచి మద్యం దిగుమతి చేస్తుంది. కొంత మందిని రూ.4000 వేల ఫ్లైట్ టికెట్లతో శ్రీలంకకు పంపిస్తున్నారు. మరి కొందరు టూరిస్టుల ముసుగులో వెళ్తుతున్నారు. అక్కడ దొరికే రాయల్‌ సెల్యూట్‌ మద్యం బాటిళ్లను ఎయిర్‌పోర్టు ద్వారా పట్టుకొస్తున్నారు. రాయల్‌ సెల్యూట్‌ మద్యం ధర శ్రీలంకలో రూ.12 వేలు ఉంటుంది. తెలంగాణలో రూ. 25 వేలు ఉంటుంది. ఇలా నాన్ పెయిడ్ లిక్కర్‌ను రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు.

గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి రవాణా..

గోవా ఎయిర్‌ పోర్టులో ఒక మద్యం షాపు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వచ్చే వారికి తక్కువ ధరలకు ఖరీదైన మద్యం బాటిళ్లు అందిస్తున్నారు. హైదరాబాద్‌కు గోవా నుంచి రోజుకు రెండు రైళ్లు వస్తాయి. ఈ రైళ్లలో గోవా నుంచి ప్రతి ఒక్కరూ రెండు నుంచి ఐదు బాటిళ్లను తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి మద్యం విరివిగా తీసుకొస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు కావడం, పన్నులు లేకపోవడం, సగం ధరకు రావడంతో రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.

ముఠాలకు మూకుతాడు వేస్తేనే..

ఎక్సైజ్‌శాఖ ధరలు పెంచి ప్రజలపై భారం మోపడం కన్నా.. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ అమ్మకాల ముఠాలకు మూకుతాడు వేస్తే..సేల్స్‌ పెరుగుతాయని మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి, ఎక్పైజ్ అధికారులకు సూచనలు చేస్తున్నారు. దీనికి తోడు జీవో 72లో లొసుగులను ప్రభుత్వం చొరవ తీసుకొని మార్పులు చేస్తే కొంత మద్యం అమ్మకాలు పెరుగుతాయని అంటున్నారు. అన్ని కోణాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అరికట్టగలిగితే ఎక్సైజ్ శాఖకు మేలు జరిగే అవకాశం ఉందని సలహా ఇస్తున్నారు.

Next Story