- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
local body polls: పండగ ఖర్చు మాదే!.. స్థానిక ఎన్నికల వేళ తెలంగాణ పల్లెల్లో లీడర్ల హామీల వర్షం
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ఓటర్లకు గాలం వేయడంలో పోటీ పడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై సీరియస్ గా కసరత్తు చేస్తుంటే మరోవైపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల కోసం ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడవచ్చనే చర్చ జోరుగా వినిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి వేడుకల్లో భారీగా ఖర్చు చేసేందుకు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు ప్రాంతాల్లోని స్థానిక ఎన్నికల ఆశావహులు వినాయకుడి విగ్రహం ఖర్చుతో పాటు మండపాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్ల ఖర్చుకు ముందుకు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో చందాలు ఇవ్వడానికి వెనకాముందుకు అయిన లీడర్లు సైతం ఇప్పుడు ఉత్సవాలను దూమ్ దామ్ నిర్వహించేందుకు గ్రామాల్లోని యూత్ కు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే గణేశ్ మండపాల వద్ద లోకల్ లీడర్ల ఫొటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగుల సందడి నెలకొన్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వినాయక చవితి ఉత్సవాలు (Vinayaka Chavithi Festival) పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.
సర్పంచ్ సీటు కోసం డిమాండ్:
రాజకీయ ప్రస్థానానికి తొలిమెట్టు సర్పంచ్ పదవినే అని భావిస్తుంటారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న వారిలో మెజార్టీ ఆశావహులు సర్పంచ్ పదవిపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ వైపు అంతగా ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవి ఆశిస్తున్న వారు ఇతర లీడర్ల నుంచి తమకు పోటీ లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ప్రజలు, పార్టీలో ఇతరుల కంటే తమకే మద్దతు ఉండేలా తమ బలం నిరూపించుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. గ్రామం, వార్డుల్లో తమ పేరు మార్మోగేలా గణేష్ ఉత్సవాల ఖర్చు విషయంలో ఇతరులతో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లపై ఎవరి అంచనాలు వారివే:
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల అంశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరుగుతోంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో అసలు ఏ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయినా నాయకుల అంచనాలు మాత్రం మరోలా ఉంటున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లను బట్టి ఆయా పంచాయతీలు ఏయే వర్గానికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్ల అమలు చట్టప్రకారం కాకుండా పార్టీ ప్రకారం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే తమ బలం చూపించి టికెట్ తమకే దక్కేలా పార్టీని ఒప్పించేందుకు ఈ ఖర్చు ఉపయోగపడుతుందనే అంచనాలతో లీడర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా తమ స్ట్రెంథ్ పెంచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానిక నేతల్లో ఒకరిని మించి మరొకరు వినాయక చవితి వేడుకలను పొలిటికల్ కెరీర్ కోసం ఉపయోగించుకుంటున్నట్లు చర్చ జరుగుగుతోంది. పండగ పూట సాగుతున్న ఈ లోకల్ రాజకీయంలో ఆ లంబోదరుడు ఎవరి విఘ్నాలను తొలగిస్తాడో చూడాలి మరి.






