Local Elections: పంచాయతీ పోల్స్‌పై సీఎం రేవంత్ ఆరా! డెడికేటెడ్ కమిషన్‌ నివేదికే కీలకం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మార్చి 21న నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Local Elections: పంచాయతీ పోల్స్‌పై సీఎం రేవంత్ ఆరా! డెడికేటెడ్ కమిషన్‌ నివేదికే కీలకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మార్చి 21న నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారం లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చా? అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీసినట్టు తెలిసింది. వార్డుల వారీగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయొచ్చు? రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్‌కు ఎన్ని రోజులు పడుతుంది? కమిషన్ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూలు ప్రకటించి, రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? అని అధికారులను వివరాలు అడిగినట్టు సమాచారం. బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం.. టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేలోపే ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించినట్టు తెలిసింది. కాగా, కులగణన రిపోర్టు సబ్ కమిటీకి అందిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఆ రిపోర్టును ఆమోదించనుంది. ఆ తరువాత బీసీ రిజర్వేషన్ ఫైనల్ చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ కసరత్తు ప్రారంభించనుంది.

బీసీ జనాభా లెక్కలకు వారం రోజులు!

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్లానింగ్ శాఖ వద్ద ఉన్నాయి. ఆ వివరాలను ఫిబ్రవరి రెండో తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అందించనున్నారు. దాన్ని కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే సమగ్ర సర్వే డేటా ఆధారంగా ప్రతి గ్రామం, వార్డుల వారీగా బీసీ జనాభా ఎంత ఉందోనని లెక్కలు తీయాల్సిన బాధ్యత పంచాయతీ రాజ్ శాఖపై ఉంటుంది. ‘బీసీ పాపులేషన్ ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుంది’ అని పంచాయితీ రాజ్ శాఖ అధికారులను సీఎం ప్రశ్నించగా.. వారం నుంచి పది రోజుల్లో పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పినట్టు తెలిసింది.

రిజర్వేషన్ల ఫైనల్ కు మరో వారం!

బీసీ జనాభా లెక్కలు డెడికేటెడ్ కమిషన్ కు అందించిన తరువాత రిజర్వేషన్లు ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని సీఎం రేవంత్ అడిగిన ప్రశ్నకు అక్కడ ఉన్న సీనియర్ అధికారులు వారం రోజల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేయొచ్చని అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఫైనల్ చేసే ముందు రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుందనే చర్చ కూడా సమావేశంలో జరిగినట్లు సమాచారం. కోర్టు అనుమతితోనే బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాల్సి ఉంటుదని న్యాయ నిపుణులు సూచించినట్లు ప్రచారం జరుగుతున్నది.

మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి

రిజర్వేషన్లు ఫైనల్ అయిన తర్వాత ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘గతంలో మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. షెడ్యూలు నుంచి, రిజల్ట్ వరకు ఆ సమయం సరిపోతుంది’ అని అధికారులు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ‘అయితే పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యేలోపు ఎన్నికలను పూర్తి చేయొచ్చా? అని సీఎం ప్రశ్నించినప్పుడు అధికారులు కంప్లీట్ చేయొచ్చని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ లోపు ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనా.. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది.

5 లేదా 6 తేదీల్లో కేబినెట్ భేటీ?

ప్లానింగ్ కమిషన్ వద్ద ఉన్న ఫ్యామిలీ సర్వే డేటాను వచ్చే నెల 2న సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. ఆ నివేదికను మంత్రివర్గం ఆమోదించడం తప్పనిసరి. అందు కోసం వచ్చేనెల 5 లేదా 6 తేదీల్లో కేబినెట్ సమావేశం ఉంటుందని తెలిసింది. కేబినెట్ ఆమోదం తరువాతనే డెడికేటెడ్ కమిషన్ కు ఆ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే న్యాయపరంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం సాధ్యం కాదు. అందుకని చట్ట సవరణ చేయాలని కేంద్రానికి అప్పీలు చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి తీర్మానం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే బీసీ జనాభా మేరకు తాము పార్టీపరంగా బీసీలకు సీట్లు ఇస్తామని, మిగతా పార్టీలు కూడా ముందుకు రావాలని అసెంబ్లీ వేదికగా ఆయన అప్పీలు చేయనున్నట్టు సమాచారం.

Next Story