- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్ని పరీక్షలా ‘స్థానిక’ ఎన్నికలు.. తగ్గేదేలే అంటున్న అన్ని పార్టీలు
స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో ప్రతి పార్టీ తమ ఉనికిని చాటుకోవడం, బలాన్ని నిరూపించుకోవడం, ప్రజల్లో తమ పార్టీ పట్ల ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. దీంతో ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు సైతం ఎన్నికలపై దృష్టి పెట్టాయి. అయితే అధికార పార్టీకి ఉండే సానుకూల వాతావరణం, ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారం ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో స్థానికం ద్వారా తెలిసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు అయిన తరుణంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ప్రజల తీర్పు అన్ని పార్టీలకు ఒక గుణపాఠంగా, అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా మారుతుందని భావిస్తున్నారు.
బలమైన అభ్యర్థుల కోసం కమలం వేట
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 8 స్థానాలను దక్కించుకోవడమే కాకుండా ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. అధికార కాంగ్రెస్‌తో సమానంగా ఎంపీలను, దాదాపుగా సమానంగా ఓట్లను సాధించింది. దీంతో ఆ పార్టీ తామే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని చెబుతున్నది. ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటుగా స్థానిక సంస్థల్లో గణనీయమైన సీట్లను సాధించి తమ సత్తా పార్లమెంట్ ఎన్నికల వరకే పరిమితం కాలేదని నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 జెడ్పీటీసీ స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అప్పుడు నలుగురు ఎంపీలు ఉన్నారు కాబట్టి 8 స్థానాలు దక్కాయని.. ఈ సారి 8 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో 16 మంది జెడ్పీటీసీలు గెలుస్తారంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు బీజేపీ నేతలను ఉద్దేశించి అపహస్యం చేస్తున్నారు. ఈ సారి పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్‌లు కాకపోయినా కనీసం జెడ్పీటీసీ సభ్యులు అయినా ఎక్కువ సంఖ్యలో గెలవాలని అంతర్గతంగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. అన్ని ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం, వారికి అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందించడంపై దృష్టి పెడితే తప్పకుండా సానుకూల ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు.
అధికార పార్టీకి అధిక సానుకూలం..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ అధికార పార్టీకైనా చాలా వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువగా వస్తాయని, స్థానికంగా పనులు అవుతాయని ఓటర్లు అభిప్రాయపడుతుంటారు. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే రకమైన ఫలితాలు వచ్చాయి. దీంతో అధికార పార్టీ నుంచి పోటీ చేయడానికి నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. రిజర్వేషన్‌లు ఎంత వరకు అనుకూలంగా వస్తాయోనని టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. అన్ని జెడ్పీలపై మూడు రంగుల జెండా ఎగురవేసి తమ సత్తా చాటాలని, ప్రతిపక్షాలు చేసే దుష్పష్రచారం కేవలం సోషల్ మీడియాలో చేసే హడావుడి తప్ప మరేమీలేదని నిరూపించాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యేకు, ఇన్‌చార్జి జిల్లా మంత్రులకు గెలుపు విషయంలో ఎక్కడా తేడా రావొద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. దీంతో ఎమ్మెల్యేలు లోకల్ పోరుపై దృష్టి పెట్టారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కేడర్‌లో ఏదైనా అసంతృప్తి ఉన్నా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కేడర్‌కు సంబంధించిన ఎన్నికలు అయినందున అత్యధిక సంఖ్యలో గెలిపించి వారికి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సూచించారు.
పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్..
ఇక బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా పూర్వవైభవం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించలేక చతికిల పడిపోయిందని, బీజేపీలో విలీనం, లేదా పొత్తు లేకుండా పార్టీ మనుగడ లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తున్నది. దీనిలో భాగంగా కొన్ని జిల్లా పరిషత్‌లను అయినా సాధించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులెవ్వరూ ముందుకు రావడంలేదని ప్రచారం జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో గెలిచినా అధికార పార్టీ నిధులు రాకుండా చేస్తుందని, రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఇబ్బంది పెడుతుందని, మరో వైపు అధికార పార్టీకి దీటుగా ఆర్థికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిసింది. కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీ ఇమేజ్ దెబ్బతిసే విధంగా తయారయ్యాయని, దీంతో ఓటర్లలో కొంత పలుచన అయ్యామని చెబుతున్నారు. వీటన్నంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగానే అగ్నిపరీక్షగా మారుతాయని, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకుంటే నాయకులు, కేడర్నిరుత్సాహపడి వలసలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.






