- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాన పార్టీలలో మొదలైన స్థానిక ఎన్నికల సందడి
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల హడావుడి లో మునిగాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల హడావుడి లో మునిగాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్‌కు రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ రానున్నది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. మరోవైపు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్, బీజేపీ కమిటీలను ఏర్పాటు చేశాయి. వచ్చే వారంలో ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్‌లో మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
సర్వేల ఆధారంగా..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నలుగురు అభ్యర్థుల పేర్లను పంపించాలని మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్‌ను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పేర్లు అందించనున్నట్టు సమాచారం. ఆ పేర్లను ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌తో కలిసి మరోసారి చర్చించనున్నారు. ఇప్పటి వరకు చేసిన సర్వేలు, వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థి పేరును ఏఐసీసీకి ప్రతిపాదిస్తారు. అక్కడ ఆమోదం అనంతరం అధికారికంగా పేరును ప్రకటించనున్నారు. బైపోల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి అభ్యర్థిని ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా గెలుపొందాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందు లో భాగంగానే గోపినాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటించారు. సానుభూతిని ప్రధానం గా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. డివిజన్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ కమిటీ ఏర్పాటు
జూబ్లీహిల్స్‌లో బీజేపీ తరుఫున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సెగ్మెంట్ కావడంతో ఆయన దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అభ్యర్థిని ఖరారు చేయడానికి ముగ్గురితో కమిటీని నియమించారు. వచ్చే వారంలో ఈ కమిటీ రాష్ట్ర పార్టీకి పేర్లను సిఫార్సు చేయనుంది.
గ్రామాల్లో కోలాహలం
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్విడుదలైంది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేండ్లు కావస్తుండటం, పాలక వర్గాల గడువు ముగిసి 18 నెలలు అవుతున్నందున ఎలక్షన్స్ నిర్వహించాలని పార్టీ అధిష్టానం పై నాయకుల నుంచి ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు రాని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు సైతం నిలిచిపోయాయి. పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు పదవులు రాలేదనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్నది. దీంతో ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. బీసీ రిజర్వేషన్ల కారణంగా కొంత ఆలస్యమైనా.. చివరికి జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం ఐదు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
కోర్టుల్లో బీసీ రిజర్వేషన్ల అంశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో కొందరు ఇటు హైకోర్టును, అటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయ స్థానాలు ఎలా స్పందిస్తాయి? ఏం తీర్పునిస్తాయనేది ఉత్కంఠగా మారింది. కానీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాలు వచ్చిన గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.






