Local Body Elections: 'కోతులను తరిమేస్తావా'.. అయితే మా ఓటు నీకే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-11 09:17:35  IST  )

ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు మాములుగా ఉండవు.

Local Body Elections: కోతులను తరిమేస్తావా.. అయితే మా ఓటు నీకే!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు మాములుగా ఉండవు. రోడ్డు, రవాణా సమస్యలు తీరుస్తాం, డ్రైనేజీలు కడుతాం, కరెంట్, వాటర్ సమస్యలు తీరుస్తాం అంటూ ఎన్నో రకాల హామీలు ప్రకటిస్తుంటారు. ప్రజలు సైతం దాదాపు ఇలాంటి హామీలే ఆశిస్తుంటారు. ఇదంతా ఒకప్పటి మాట ఇవన్నీ సమస్యలు ఏమో గానీ.. తమ ప్రధాన సమస్య తీర్చినవారికే ఓటేస్తామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటో తెలుసుకుందాం.

మరికొద్ది రోజుల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ క్రమంలో ఆశావహులు ఇప్పటి నుంచే ఎన్నికలు సిద్ధమవుతున్నారు. తమకే ఓటు వేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగం ఓటర్ల సమస్యలు ఏంటో తెలుసుకుని ఆ దిశగా ప్రచారంలోకి దిగేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక గ్రామాల్లో కోతుల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనుషులపై దాడులు చేస్తూ, పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తూ నరకం చూపుతున్నాయి. అంతేకాదు, రోజు రోజుకు ఈ కోతుల సంఖ్య ఎక్కువవుతుండటంతో ఇప్పుడు గ్రామాల్లో ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతుల సమస్యే ప్రధానంగా ప్రచారంలో దిగనున్నారు. ఓటర్లు సైతం ఈ కోతుల సమస్యను ఎవరు తీరిస్తే వారికే ఓటేస్తామంటూ చెబుతున్నారు. గతంలోనూ సర్పంచ్ ఎన్నికల్లో ఇలా కోతుల బెడద నివారిస్తామని హామీ ఇచ్చినవాళ్లు భారీ మెజారిటీతో గెలుపొందటం విశేషం.

ఇక రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జనావాసాల్లో ఎటుచూసినా కోతులే కనిపిస్తున్నాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలో గాయపడటంతో పాటు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అలాగే, రైతులు సాగుచేసిన పంటలను సైతం కోతులు ఆగం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వ్యవసాయ దిగుబడుల్లో 20 నుంచి 30శాతం పంటలను కేవలం కోతుల వల్లే కోల్పోతున్నామని అగ్రికల్చర్​ఆఫీసర్లు చెప్తున్నారు. వీటిని నియంత్రించకపోతే రాబోయే పదేండ్లలో 50 శాతానికి పైగా పంటలకు గ్యారెంటీ ఉండదని హెచ్చరిస్తున్నారు.

కోతుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్‌లో మంకీ రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఒక డాక్టర్, ఫార్మాసిస్టు, నలుగురు సిబ్బందిని నియమించి.. రాష్ట్రవ్యాప్తంగా పట్టితెచ్చే కోతులకు ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్​చేయించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. కోతులను పట్టి తెచ్చే బాధ్యతను ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. అయితే, ఒక్కో కోతిని పట్టుకోవడానికి మంకీ క్యాచర్లు రూ.వెయ్యి దాకా డిమాండ్​ చేస్తుండటంతో పంచాయతీలు, బల్దియాలు ఈ సమస్యపై చేతులెత్తేశాయి. దీంతో ఈసారి కోతుల బెడద నివారించేవారికే ఓట్లు వేస్తామని జనం అంటున్నారు. ఇందుకోసం కొన్ని గ్రామాల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు.

Next Story