Seethakka: జూలై నాటికి సర్పంచ్ ఎన్నికలు: మంత్రి సీతక్క

by Prasad Jukanti |

సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Seethakka: జూలై నాటికి సర్పంచ్ ఎన్నికలు: మంత్రి సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే లోకల్ బాడీ ఎన్నికలపై తాజాగా మంత్రి సీతక్క ఆసక్తికర (Seethakka) వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్ని జీపీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, అందుకోసం పార్టీలో కొత్త, పాత నేతలు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమిష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

పదే పదే ప్రస్తావన..

ఎన్నికల నిర్వహణ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనతో భేటీ అయిన ఆయా జిల్లాల నేతలకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలైలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా గత వారం నుంచి రాష్ట్ర మంత్రులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఫోకస్ పెట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు తాము పాల్గొంటున్న సమావేశాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మంత్రుల నోట ఎన్నికల అంశం ప్రస్తావన పెరుగుతుండటంతో ఏ క్షణంలోనేనా నోటిఫికేషన్ రాబోతున్నదనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వ కసరత్తు సైతం స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహింస్తోంది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, సిబ్బంది కొరత లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటోంది.

Next Story