- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Local body election: రిజర్వేషన్లు తేలితేనే ఖర్చుకు సై.. లోకల్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కొత్త చిక్కులు
స్థానిక ఎన్నికల రాజకీయం అంతా బీసీల రిజర్వేషన్ల చుట్టే తిరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికల (Local body elections) ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో మెజార్టీ స్థానాలు ఖాతాలోనే వేసుకోవాలని అధికార, విపక్ష పార్టీలు కసరత్తు చేస్తు్న్నాయి. ఎన్నికల నిర్వహణకు కాస్త సమయం దొరకడంతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా, అటు మిగతా పార్టీలు సైతం రెడీ అంటూ చాలెంజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీల అగ్రనేతల మధ్య పొలిటికల్ వార్ ఫైర్ జరుగుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అన్ని పార్టీలకు రిజర్వేషన్ల సమస్య తలనొప్పిగా మారింది.
అన్ని పార్టీల్లో సేమ్ సీన్..
స్థానిక ఎన్నికల అంశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) చుట్టే తిరుగుతోంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందేనని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఏ పంచాయతీలో ఏ రిజర్వేషన్ వస్తుందో అనే ఉత్కంఠ నెలకొన్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోటీకి సిద్ధంగా అనేకమంది ఆశావహులు ఉన్నప్పటికీ రిజర్వేషన్ల వల్ల తమకు అవకాశం దక్కకపోతే ఎలా అనే డైలమాలో పడుతున్నారు. దీంతో ఖర్చుకు వెనకాముందు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ తమకే వస్తుందనే ధీమాలో పార్టీ కార్యక్రమాలు, కేడర్ బలోపేతం కోసం ఇన్నాళ్లు హడావిడి చేసిన ముఖ్య నేతలు సైతం రిజర్వేషన్ కారణంగా తమకు అవకాశం దక్కదేమోననే ఆలోచనతో ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, దీంతో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ మేరకు జోష్ కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
అంచనా వేస్తూ.. ఆరా..
కోర్టు డెడ్‌లైన్‌తో రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. బీసీ బిల్లులు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడికి సర్కార్ ప్లాన్ చేస్తోంది. అది వర్కౌట్ కాకపోతే పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ప్రస్తుతం తమ గ్రామ పంచాయతీలో అమలు అవుతున్న రిజర్వేషన్ స్థితి, కొత్త సమీకరణాలతో రాబోయే రిజర్వేషన్ కేటగిరి ఏంటి అనేదానిపై ఆశావహులు అంచనాలు వేసుకుంటూ రాజకీయ పెద్దలు, అధికారుల వద్ద ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.






