Liquor scam: లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్.. తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి ప్రకంపణలు తప్పవా?

by Prasad Jukanti |   (  Updated:2025-02-25 09:53:06  IST  )

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక ట్విస్ట్ నమోదైంది.

Liquor scam: లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్.. తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి ప్రకంపణలు తప్పవా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీ పై రూపొందించిన కాగ్ నివేదికను (CAG Report) ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో (Delhi Assembly) ప్రవేశపెట్టింది. 2021-22లో నాటి కేజ్రీవాల్ (Kejriwal) ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. సభ అనుమతి కోరకుండానే ఎక్సైజ్ రూల్స్ రూపకల్పన చేశారని ఆక్షేపించింది. నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టులు ఇచ్చారని, నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోవడం, ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగును అనుమతించడం, ఉల్లంఘనలకు జరిమానా వేయకపోవడం, విధానాల రూపకల్పనలో పారదర్శకత పాటించకపోవడం చోటు చేసుకున్నాయని కాగ్ తన దర్యాప్తులో తేల్చింది.

తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనం?:

ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో కొన్ని నెలలకే దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ తర్వాత ఈ వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసులు నమోదు కాగా సీఎంగా ఉండగానే అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టు అయి జైలుకు వెళ్లారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఇదే కేసులో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఐదు నెలల పాటు జైళ్లో ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా లిక్కర్ పాలసీ అంశం కారు పార్టీని కంగారు పెట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓటమి పాలవడం, కొత్తగా ఏర్పడిన రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇంతలోనే లిక్కర్ పాలసీపై కాగ్ నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకురావడం పొలిటికల్ గా చర్చనీయాశం అవుతున్నది. ఢిల్లీ రాజకీయ పరిణామాలు అటు ఇటు తిరిగి తెలంగాణ (Telangana) పాలిటిక్స్ లో మరోసారి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారబోతున్నదా అనే టాక్ వినిపిస్తోంది.

Next Story
null