- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబులకు షాకివ్వనున్న ప్రభుత్వం.. లిక్కర్ రేట్లపై యుద్ధం ఎఫెక్ట్!
మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాకివ్వనుంది. వచ్చే నెల నుంచి లిక్కర్ రేట్లు పెంచెేందుకు సన్నద్ధమవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే నెలలో లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం కావాల్సిన కసరత్తును మొదలుపెట్టింది. ధరలను నిర్ధారించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని సైతం ఏర్పాటు చేసింది. అందులో ఒక రిటైర్డ్ జడ్జి, ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్, ఒక ఆడిటర్ ఉన్నారు. ఈ కమిటీ మద్యం ఉత్పత్తిదారుల ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల చివర ముగియనుంది. వచ్చేనెలలో కొత్త మద్యం ధరలు అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రతి రెండేళ్లకు ఒకసారి..
రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకూ ఒకసారి లిక్కర్ ధరలను సమీక్షించడం ఆనవాయితీ. బీఆర్ఎస్ హయాంలో 2023 మే నెలలో లిక్కర్ ధరలను పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది 2025 మేలో లిక్కర్ రేట్లను సవరించాలని కంపెనీలు ఒత్తిడి చేశాయి. కానీ ప్రభుత్వం కొంత కాలం వరకు ఓపిక పట్టాలని చెప్పడంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. కొన్ని రోజులుగా మద్యం ఉత్పత్తి కంపెనీలు రేట్లను సమీక్షించాలని కోరడంతో ప్రభుత్వం ధరల నిర్ధారణకు కమిటీని నియమించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఆ కమిటీ వచ్చేవారంలో తొలి సమావేశం నిర్వహించి, కంపెనీల ప్రపోజల్స్‌ను పరిశీలించనున్నట్లు తెలిసింది. ఈనెల చివరన కమిటీ తన పూర్తిస్థాయి నివేదిక అందిస్తుందని, వచ్చే నెలలో కొత్త మద్యం ధరలు అమలవుతాయని ఎక్సయిజ్ శాఖ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది.
యుద్ధం ఎఫెక్ట్ సైతం..
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం లిక్కర్ కంపెనీలపై పడింది. దీంతో మద్యం సీసాల తయారీ ఖర్చు పెరిగిందని నిపుణులు అంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా సీసాల తయారీ పరిశ్రమలు రేట్లను పెంచాయి. ఆ ప్రభావం మద్యం తయారీదారులపై పడటం వల్ల లిక్కర్ రేట్లను సవరించాలని కోరుతున్నాయి.
కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్..
అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సైతం మద్యం ధరలను పెంచేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. విమర్శలు రాకుండా అన్ని కోణాల్లో ఆలోచించి లిక్కర్ రేట్లను సవరించాలని సూచించినట్లు సమాచారం. లిక్కర్ రేట్లను 12–15 శాతానికి పెంచాలని కంపెనీలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. కానీ అంత మేర ధరలను పెంచితే ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మధ్యేమార్గంగా 3–5శాతం పెంచే అవకాశం ఉందని తెలిసింది. నార్మల్ బ్రాండ్స్ బాటిల్‌కు (750 ఎంఎల్) కనిష్టంగా రూ. 60–80 పెంచడం, ప్రీమియం బ్రాండ్స్‌కు రూ. 100–120 వరకు పెంచే చాన్స్ ఉంది. దీంతో ప్రతి నెలా ప్రభుత్వానికి అదనంగా దాదాపు రూ. 300 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.






