‘మహా’ మద్యం వరద.. జోరుగా జిల్లాలోకి దేశీదారు రవాణా

by Disha Web Desk 4 |
‘మహా’ మద్యం వరద.. జోరుగా జిల్లాలోకి దేశీదారు రవాణా
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మహారాష్ట్ర మద్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏరులై పారుతుంది. కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దు మార్గాల నుంచి జోరుగా రవాణా సాగుతున్నప్పటికీ మహారాష్ట్రలో ఉత్పత్తి అయ్యే దేశిదారు అమ్మకాలకు ఇక్కడ ముకుతాడు వేయడంలో ఆబ్కారీ శాఖ విఫలం అవుతోంది.

ధర తక్కువ కారణంగా..

మహారాష్ట్రలో దేశీదారు విక్రయాలు జోరుగా సాగుతాయి. తెలంగాణలో అమ్మే చీప్ లిక్కర్ ధరలతో పోలిస్తే దేశిదారు ధరలు తక్కువ. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో దేశీదారు విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దేశీదారుతో పాటు సంత్ర, బింగిరి వంటి రకాలు మహారాష్ట్రలో ఫేమస్. ఈ లిక్కర్‌కు గిరాకీ ఎక్కువ ఇక్కడి ప్రాంత ప్రజలు కూడా దేశదారు అంటే అమితంగా ఇష్టపడతారు. ధర కూడా తక్కువగా ఉండడంతో లిక్కర్ అలవాటు ఉన్న పేదలు దాని వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇక్కడి గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారితో పాటు కొందరు దేశి దారు అమ్మకాలను వ్యాపారంగా కొనసాగిస్తున్నారు. క్వార్టర్ రూ. 80 నుంచి 90 రూపాయల ధరతో లభిస్తుంది. చీప్ లిక్కర్ ధర ఇక్కడ 110 నుంచి 120 ధరలతో అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో మరో ఐదు రూపాయల నుంచి పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా మద్యంప్రియులు దేశిదారువైపు మల్లుతున్నారు.

ధరలు తగ్గించినా తగ్గని అమ్మకాలు

తెలంగాణలో చీప్ లిక్కర్ ధరలపై ప్రభుత్వం పది రూపాయలు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ దేశిదారు అమ్మకాలు తగ్గడం లేదు. దేశిదారు లిక్కర్ కు ఇక్కడ అమ్మే లిక్కర్ కు మరో 20 నుంచి 30 రూపాయల తేడా ఉండడంతో మద్యం ప్రియులు దేశిదారు వైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడి మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయి అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిరంతరం దేశదారు అమ్మకాలపై దాడులు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ ఎక్కువగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

సరిహద్దుల నుంచి రవాణా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మహారాష్ట్ర సరిహద్దుల గుండా జోరుగా దేశీదారు రవాణా జరుగుతుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన బాసర మండలం బిద్రెల్లి తానూరు మండలం బెల్ తరోడ కుబీర్ మండలం సిరిపెల్లి సారంగాపూర్ మండలం స్వర్ణ బోత్ మండలం గన్ పూర్ ఆదిలాబాద్ మండలం బోరజ్ వాంకిడి మండలం గోయెగామ్ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల మీదుగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దేశీదారు రవాణా సాగుతోంది. ఇది నిత్యకృత్యమైనప్పటికీ ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


Next Story

Most Viewed