ప్రాణాలు హరిస్తున్న గడ్డి మందుపై నిషేధం విధించాలి : ఖమ్మం ఎంపీ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును కొందరు..

ప్రాణాలు హరిస్తున్న గడ్డి మందుపై నిషేధం విధించాలి : ఖమ్మం ఎంపీ
X
  • రాష్ట్రంలో పారాక్వాట్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది
  • లోక్ సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును కొందరు క్షణికావేశంలో తాగి ప్రాణాలు కోల్పోతున్నారని , కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా బుధవారం 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైద్య చికిత్సలో విరుగుడు లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతులు, వ్యవసాయ కూలీలు, యువకుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పారాక్వాట్ పై 60కి పైగా దేశాలు నిషేధం విధించాయని ఆయన తెలిపారు. దీని వినియోగంతో పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందని, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటి ప్రధాన పంటల్లో ఈ గడ్డి మందు అవశేషాలు గుర్తించారని, ప్రజల ఆరోగ్యానికి కూడా హాని పొంచి ఉందని రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో పేర్కొన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయ మందును అందుబాటులోకి తెచ్చి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కోరారు. గడ్డిమందు నిషేధంపై కేంద్రం తీసుకునే నిర్ణయాత్మక చర్య మన వ్యవసాయాన్ని, సమాజ గౌరవాన్ని నిలబెడతాయని ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు.

Next Story