కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు.. కీలక అభ్యర్థన

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-12 11:29:13  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు లేక, జీతాలు అందక 5 వేల మంది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఆవేదన చేశారు.

కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు.. కీలక అభ్యర్థన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నియమితులైన లైసెన్స్‌డ్ సర్వేయర్లు (Licensed Surveyors) ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో దాదాపు 5 వేల మందికి పైగా సర్వేయర్ల ప్రతినిధులు ఆయనను కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. నెలల తరబడిగా తమకు అటు పని, ఇటు వేతనం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆరోపించారు.

ప్రభుత్వం తమను నియమించి నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు పని కేటాయింపులు (Work Allotment) జరగలేదని, ఫలితంగా జీతభత్యాలు అందక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని సర్వేయర్లు వాపోయారు. ప్రతిరోజూ తమను ఎమ్మార్వో (MRO) కార్యాలయాలకు పిలిపిస్తున్నారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారు తప్ప ఒక్క పని కూడా అప్పగించడం లేదని వారు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైసెన్సుడ్ సర్వేయర్లకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయని, కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూభారతి’ పేరుతో తమను మోసం చేసిందని కామెంట్ చేశారు. పనుల కేటాయింపులో స్పష్టమైన విధానం లేదని, అందరికీ సమానంగా పనులు దక్కేలా ఒక సమగ్రమైన పద్ధతిని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్ హామీ..

సర్వేయర్ల సమస్యలను ఓపికగా విన్న కేటీఆర్ వారి వినతి పత్రాన్ని స్వీకరించారు. కష్టపడి శిక్షణ పొంది, లైసెన్సులు పొందిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం ఈ విధంగా వదిలేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. లైసెన్సుడ్ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలోనూ, బయట కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.

‘కర్మ రిటన్స్’ అని కవిత చేసిన ట్వీట్ మర్చిపోయావా?.. కేటీఆర్: కాంగ్రెస్

Next Story