TG: భూప‌రిపాలనలో మరో అడుగు.. ప్రతి మండలంలో లైసెన్సుడ్ సర్వేయర్

by Gantepaka Srikanth |

రైతాంగానికి మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డానికి, భూముల‌కు సంబంధించిన అనేక పంచాయితీల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపాల‌నే ల‌క్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.

TG: భూప‌రిపాలనలో మరో అడుగు.. ప్రతి మండలంలో లైసెన్సుడ్ సర్వేయర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతాంగానికి మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డానికి, భూముల‌కు సంబంధించిన అనేక పంచాయితీల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపాల‌నే ల‌క్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవ‌స్థను బ‌లోపేతం చేసే దిశ‌గా ఇప్పటికే జీపీవోలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాజాగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. ఈ నెల 19వ తేదీన శిల్ప క‌ళావేదిక‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేయ‌నున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ ను జ‌త ప‌ర‌చ‌డం తప్పనిసరి చేసిన నేప‌ధ్యంలో స‌ర్వే విభాగం పాత్ర మ‌రింత క్రియాశీలం కానుంద‌న్నారు. భూ భార‌తి చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ ల‌క్ష్యం నెర‌వేరాలంటే ప్రస్తుతం ఉన్న 350 మంది స‌ర్వేయ‌ర్లు స‌రిపోర‌ని, మ‌రి కొంత మంది స‌ర్వేయ‌ర్లు అవ‌స‌ర‌మ‌వుతార‌న్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని ఒక వైపు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను తీసుకోవ‌డం, మ‌రోవైపు స‌ర్వే విభాగంలో ఖాళీగా ఉన్న స‌ర్వేయ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌డం, ఇంకో వైపు భూముల స‌ర్వేకు అవ‌స‌ర‌మైన అత్యాధునికి ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. శుక్రవారం స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో రెవెన్యూ శాఖ కార్యద‌ర్శి డీఎస్ లోకేష్‌కుమార్‌, స‌ర్వే విభాగం క‌మిష‌న‌ర్ రాజీవ్ గాంధీ హ‌నుమంత్ తో క‌లిసి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సూచ‌న మేర‌కు అవ‌స‌ర‌మైన స‌ర్వేయ‌ర్లను అందుబాటులోకి తీసుకురావ‌డానికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌గా 10 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా తొలివిడ‌త‌లో ఏడు వేల మందికి శిక్షణ ఇచ్చామ‌న్నారు. ఇందులో 3,465 మంది అర్హత సాధించార‌ని తెలిపారు. భూ విస్తీర్ణాన్ని బ‌ట్టి ప్రతి మండ‌లానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను నియ‌మిస్తామ‌న్నారు.

రెండో విడ‌త‌లో మ‌రో మూడు వేల మందికి ఆగ‌స్టు 18వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభించామ‌న్నారు. ఈ నెల 26వ తేదీన జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత ప‌రీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప‌రీక్షలో అర్హత సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రంటిస్ శిక్షణ ఉంటుంద‌న్నారు. వారి సేవ‌లు కూడా డిసెంబ‌ర్ రెండో వారం నాటికి అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్లడించారు. రెవెన్యూ శాఖకు సర్వే విభాగానికి అవినాభావ సంబంధం ఉంటుంద‌ని, భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్నప్పుడే వివాదాలు తగ్గుతాయ‌న్నారు. సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలకు తగిన సేవలు అందలేదని గుర్తుచేశారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ఇప్పుడు ప్రతి మండలంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవినీతి లేని సేవలు అందించడమే త‌మ ప్రభుత్వ సంక‌ల్పమ‌న్నారు.

Next Story