కృష్ణా- గోదావరిలో ఒక్క నీటి చుక్క కూడా వదులుకోం : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

by Ratna Kumari |

తెలంగాణ ప్రజలకు చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాలో ఎలాంటి రాజీ ప్రశ్నే లేదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పష్టం చేశారు.

కృష్ణా- గోదావరిలో ఒక్క నీటి చుక్క కూడా వదులుకోం : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
X

దిశ‌, కోదాడ : తెలంగాణ ప్రజలకు చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాలో ఎలాంటి రాజీ ప్రశ్నే లేదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పష్టం చేశారు. కృష్ణ, గోదావరి నదుల విషయంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయ నిర్ణయాల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఆ తప్పిదాలను సరిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలో రూ.8 కోట్లతో నిర్మిస్తున్న ఆర్‌ అండ్ బీ గెస్ట్‌హౌస్‌, డివిజన్‌ కార్యాలయం, రూ.4 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు భవనం, రూ.5.10 కోట్లతో నిర్మిస్తున్న ఇరిగేషన్‌ డివిజన్‌ కార్యాలయ భవనాల పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీ పడొద్దని, ప్రజల సొమ్ముతో నిర్మించే ప్రతి భవనం ప్రభుత్వ ప్రతిష్టను చాటాలన్నారు. కృష్ణ నీటిపై గత ప్రభుత్వ రాజకీయ లొంగుబాటుఅనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణ నది నీటి పంపకాల్లో గత ప్రభుత్వం రాజకీయ లొంగుబాటుతో తెలంగాణకు కేవలం 34 శాతం (299 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం (512 టీఎంసీలు) అంగీకరించిందని విమర్శించారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే కృష్ణ జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా దక్కేలా న్యాయపోరాటం చేస్తోందని తెలిపారు. వేల కోట్ల ఖర్చు.. ఫలితం శూన్యం అన్నారు.

రూ.1.83 లక్షల కోట్లు కేటాయించినా..?

గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.17 లక్షల కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తే.. నీటిపారుదల రంగానికి రూ.1.83 లక్షల కోట్లు కేటాయించినా ఒక్క కీలక ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని మంత్రి తీవ్రంగా విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొడంగల్-నారాయణపేట, డిండి, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు ప్రజల కళ్లముందే అర్ధాంతరంగా మిగిలి పోయాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టిందని, వచ్చే మూడేళ్లలో కృష్ణ నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేలా కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వరకు పోరాటం కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. తెలంగాణ హక్కుల కోసం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలసంఘం, నది ట్రైబ్యునళ్ల ముందు బలమైన వాదనలు వినిపించి న్యాయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోదాడ అభివృద్ధికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. కోదాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రెడ్లకుంట, శాంతినగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలేరు వాగుపై చెక్‌డ్యామ్‌, పాలవరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌, నడిగూడెం చౌదరి చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్‌ కెనాల్‌పై డబుల్‌ బ్రిడ్జి, పాలే అన్నారం వద్ద బ్రిడ్జి పనులు ప్రారంభించి ఎండాకాలం చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు.మోతే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ భూసేకరణలో రైతులకు అన్యాయం జరగకుండా న్యాయమైన నష్టపరిహారం అందించాలని ఆర్డీవోను ఆదేశించారు.ఈ సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌, ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రమేష్‌బాబు, ఎస్‌ఈలు నాగభూషణం, శివతేజ, ఆర్‌ అండ్‌ బి ఈఈసీతారామయ్య, ఆర్డీవోలు సూర్యనారాయణ, వేణుమాధవ్‌, త‌హ‌శీల్దార్ వాజిద్ అలీ పాల్గొన్నారు.

Next Story