పోరాటాలతో జనగణనలో ఓబీసీ కులగణనను సాధిద్ధాం: ప్రభుత్వ సలహాదారు వీహెచ్

by Kema Shiva Kumar |

జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీ. హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష విరమించారు.

పోరాటాలతో జనగణనలో ఓబీసీ కులగణనను సాధిద్ధాం: ప్రభుత్వ సలహాదారు వీహెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణనలో బీసీ వర్గాలను కూడా చేర్చాలని, 60 శాతం బీసీలకు న్యాయం చేయాలని, జనగణనలో కులగణన కుడా చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ అంబర్‌పేట‌లోని తన నివాసంలో రెండు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు తన దీక్షను విరమించారు. ఇవాళ తెలంగాణ శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కోదండరాం, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు బీసీ నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం వీ.హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీ అయిన ప్రధాని మోదీ కూడా ఆ బీసీలకే అన్యాయం చేస్తున్నారని, మోదీ బీసీ వ్యతిరేకి అని నిరూపించుకున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీలు నిరంతరం పోరాటం చేయాలని, ర్యాలీలు ధర్నాలతో ఉద్యమం చేపట్టాలన్నారు. తమ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తమ సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. తన దీక్షకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు, నిరుద్యోగ జేఏసీకి వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.

Next Story