కోట్ల విలువైన భూ కబ్జాకు లియోనియా రిసార్ట్ ప్లాన్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

బొమ్మరాస్పేట్ గ్రామ శివారులోని రైతులకు చెందిన కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కబ్జా చేయాలని లియోనియా రిసార్ట్‌కు సంబంధించిన యజమానులు చూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు.

కోట్ల విలువైన భూ కబ్జాకు లియోనియా రిసార్ట్ ప్లాన్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బొమ్మరాస్పేట్ గ్రామ శివారులోని రైతులకు చెందిన కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కబ్జా చేయాలని లియోనియా రిసార్ట్‌కు సంబంధించిన యజమానులు చూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. శామీర్‌పేట మండలంలోని బొమ్మరాస్పేట్ గ్రామానికి చెందిన రైతులు తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని.. కాపాడాలని కోరుతూ ప్రవీణ్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి సహకారం ఉన్నదని.. అధికారులను పావులుగా వాడుకొని రైతులకు ద్రోహం చేయాలని చూస్తున్నారని.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. 2019లోనే కీసర రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ భూమికి సంబంధించి సంపూర్ణ అధికారాలు రైతులకే దక్కుతాయని స్పష్టం చేశారని.. అయినా ఇప్పుడు ప్రభుత్వ పెద్దల అండదండలతో స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చి, తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకొని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు కౌలుదారు, వ్యవసాయ భూముల చట్టం 1950లోని సెక్షన్ 93 కి వ్యతిరేకంగా తప్పుడు ఆదేశాలతో కూడిన ఆర్డర్ ఇస్తూ అసలైన రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా కనీసం రైతులకు నోటీసులు ఇవ్వకుండా, లియోనియా రిసార్ట్ యజమానులకు అనుకూలంగా ఆగమేఘాల మీద ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.

Next Story