జాతీయ రాజకీయాల్లో లెజెండ్ రేవంత్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

జాతీయ రాజకీయాల్లో లెజెండ్ రేవంత్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‍రెడ్డి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‍గా మారాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే లెజెండ్‍గా మారబోతున్నారని అన్నారు. ఇవాళ సీఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తు పట్టడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి భారత జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యహరించబోతున్నారని, తలకాయ బాదుకున్నా దాన్ని మీరు ఆపలేరన్నారు. రాబోయేది మా ప్రభుత్వమే అంటున్న కేటీఆర్.. మీ ప్రభుత్వం ఎట్లా గెలుస్తుందని ప్రశ్నించారు. మీపై రేవంత్ రెడ్డి డేగకన్ను వేశారని వచ్చే ఎన్నికల్లో మీకు ఉన్న సీట్లు కూడా రావన్నారు.

కేటీఆర్‍కు రేగు కంపలా కవిత:

కేటీఆర్‍కు రేగు కంప లా కవిత తగిలిందని, కవిత రూపంలో కేటీఆర్‍కు చిక్కులు మొదలయ్యాయన్నారు. విమర్శలు చేసే ముందు మీ చెల్లె పార్టీ ఎందుకు పెట్టిందో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పదేండ్లు ఏమి పీకి కట్టలు కట్టారని కవిత అంటోందని ఆ విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. ఏమి చేయకపోతే తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారో కవిత చెప్పాలన్నారు. అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లిని కాదని కేసీఆర్ నీకు ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటి పొరుతో ఇబ్బంది పడుతూ మంది జోలికి ఎందుకు పోతావ్ కేటీఆర్? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తుపట్టట్లేదు కేటీఆర్ అంటుండు. కానీ కేటీఆర్‍ను గుర్తుపట్టే స్థలాలు నాకు బాగా తెలుసన్నారు. గుంట నక్కలు, తోడేళ్ళు అందరూ మీ దగ్గరనే ఉన్నారన్నారు. మరో పదేండ్లు కాంగ్రెస్ పార్టీని కదిలించే దమ్ము ఎవరికీ లేదన్నారు. మీరు ఆర్టీసీని డిస్టర్బ్ చేయాలని చూశారని విమర్శించారు.

Next Story