తొలి కేబినెట్‌లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్దత.. బిర్లా మందిర్‌లో కాంగ్రెస్ నేతల ప్రమాణం

by Satheesh |

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై నిర్ణయం తీసుకుంటామని టీ కాంగ్రెస్ నేతలు బిర్లా మందిర్, నాంపల్లి దర్గాలో

తొలి కేబినెట్‌లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్దత.. బిర్లా మందిర్‌లో కాంగ్రెస్ నేతల ప్రమాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై నిర్ణయం తీసుకుంటామని టీ కాంగ్రెస్ నేతలు బిర్లా మందిర్, నాంపల్లి దర్గాలో ప్రమాణం చేశారు. బుధవారం టీకాంగ్రెస్ నేతలు బిర్లా మందిర్, నాంపల్లి దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రే, పార్టీ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, వీహెచ్, మల్లురవి తదితరులు ఈ పూజలు, ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల కార్డు, మేనిఫెస్టో కార్డును వెంకటేశ్వర స్వామి ముందు, దర్గాలో ఉంచి పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అమలు, ఆరు గ్యారెంటీలను చట్టం చేస్తామని ప్రమాణం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటన జారీ చేశారు.

గ్యారెంటీల చుట్టే ప్రచారం:

తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయభేరి సభలో బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని తాజాగా పార్టీ నేతలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద ప్రతి యేటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటించారు. గృహ జ్యోతి పథకం కింద ఇళ్లలో వాడే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందజేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం, ఫీజు రియంబర్స్ మెంట్, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చేయూత పేరుతో పింఛనుదారులకు నెలకు రూ.4 వేల పింఛను, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారెంటీలను ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి పార్టీ ముఖ్యనేతలు ఈ ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి చూపుతామని ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టోపై దేవుళ్ల సాక్షిగా ప్రమాణం చేయరడం ఆసక్తిగా మారింది.

టీకాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు:

అంతకు ముందు గాంధీ భవన్ నుంచి టెంపుల్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉందని నేతలను అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లేదని దైవదర్శనానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అని నిలదీశారు. అనంతరం పోలీసుల సూచనల మేరకు కేవలం రేవంత్ రెడ్డి, మాణిక్ రావు థాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవిలు మాత్రమే తొలుత బిర్లా మందిర్‌కు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం నాంపల్లి దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు.

Next Story