Legal Notice: స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-13 07:52:03  IST  )

అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.

Legal Notice: స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka).. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌‌లో సంచలనంగా మారింది. అయితే, అంగన్‌వాడీ టీచర్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోంది. తక్కువ ధర ఉన్న ఫోన్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఇందులో మంత్రి సీతక్క హస్తం ఉందని పోస్టులు వైరల్ అయ్యాయి.

మంత్రి సీతక్క రియాక్షన్..

తనతో పాటు ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్‌కు ఆమె లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవ ప్రచారం చేసినందుకు సోషల్ మీడియాలో 48 గంటల్లో పెట్టిన పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వ కొనుగోళ్లు అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, బీఆర్ఎస్ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఈ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, పార్టీ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే మరి.

Next Story