- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నరేగా నిధుల్లో కేంద్రం వాటా తగ్గించడం సరిగాదు
నరేగా నిధుల్లో కేంద్రం వాటా తగ్గించడం సరిగాదు

దిశ, తెలంగాణ బ్యూరో: కొట్లాడి సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు గ్రామీణ ప్రజలంతా కలిసికట్టుగా నడవాలనీ, ఈనెల 22 సికింద్రాబాద్‌లో ప్యాట్నీలోని గాంధీ విగ్రహం వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయ్రపదం చేయాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. 23న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసనలను కూడా విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ...ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. కేంద్రం తన వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించుకోవడం, రాష్ట్రాల వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచడం అందులో భాగమేనని తెలిపారు.
సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ఈటీ నర్సింహ మాట్లాడుతూ... రాముడి సెంటిమెంట్, మతం మత్తులో ప్రజలను ముంచి దేశ సంపదను మోడీ సర్కారు కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. అందులో భాగంగానే కార్పొరేట్లకు, భూస్వాములకు ఆంటకంగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోతున్నదని విమర్శించారు. ఓ పక్కన ఇందిరాగాంధీ, నెహ్రూ, గాంధీ మీద రాజకీయ దాడి చేస్తూనే మరోవైపు దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్థన్ మాట్లాడుతూ... 2047 కల్లా దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే ఉద్దేశ్యంతో మోడీ పాలనలో ఆర్ ఆర్ ఎస్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నదని తెలిపారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హన్వేష్ మాట్లాడుతూ..ప్రజలకు గ్యారెంటీ, భరోసానిచ్చే చట్టాలను నిర్వర్యం చేస్తూ పేదల హక్కుల మీద మోడీ సర్కారు దాడి చేస్తున్నదని విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ, స్టాండింగ్ కమిటీలో కనీసం చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ..ప్రజల ముందు రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేసి తాను బలపడేందుకు మోడీ సర్కారు ఇలా చట్టాల్లో మార్పులు చేసుకుంటూ పోతున్నదన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత ఆర్‌వీ.ప్రసాద్ మాట్లాడుతూ..పథకానికి రాముడి పేరు అర్థం వచ్చేలా పెట్టి పేదల పొట్టగొట్టేలా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, అబ్బాస్, సీనియర్ నేత డీజీ నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.






