- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై యుద్ధం ఆపాలని భారత్ అమెరికాపై ఒత్తిడి తేవాలి.. వామపక్ష పార్టీల నిరసన ర్యాలీ
ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తలపెట్టిన యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రధాని మోడీ అమెరికాకు స్పష్టంగా చెప్పాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తలపెట్టిన యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రధాని మోడీ అమెరికాకు స్పష్టంగా చెప్పాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మొత్తం 140 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ప్రధాని అసమర్థత కారణంగా ప్రజలందరూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాల దురాక్రమణ దాడిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తా నుంచి వైఎంసీఏ వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రసంగించారు. అమెరికా జాతి, సామ్రాజ్యవాద అహంకారంతోనే యుద్ధం చేస్తోందని కూనంనేని సాంబశివరావు అన్నారు.
యుద్దం ఇరాన్‌పై మాత్రమే కాదు..
అమెరికా జాతి, సామ్రాజ్యవాద అహంకారంతోనే ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉందని అన్నారు. ఇప్పడు యుద్దం ఇరాన్‌పై మాత్రమే కాదని, గతంలో పాలస్తీనా, చీలి, లిబియా, లాంటి దేశాలపై దాడులు చేసి ఆ దేశాల అధ్యక్షులతో అనేక మంది హత్యలకు పాల్పడిందని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా డాలర్ పెత్తనం కొనసాగాలంటే నిరంతరం యుద్దాలు జరుగుతుండాలనేదే అమెరికా లక్ష్యమని, తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో సంక్షోభం ఏర్పడి ఇతర దేశాల కరెన్సీ విలువలు పడిపోయి డాలర్ మరింత బలపడేలా చేసుకునేందుకే ఈ యుద్ధ కాంక్ష అన్నారు.
ప్రధాని అమెరికాపై ఒత్తిడి తేవాల్సిందే..
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ, అమెరికా కేవలం తమ స్వార్థం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను స్వాధీనం చేసుకునేందుకు ఈ యుద్దాన్ని తలపెట్టిందని సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ఎక్కడో జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా దేశంలోని రైతులు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఏమీ పట్టనట్లుగా అమెరికాకు బానిసలా వ్యవహరిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కావాలంటే ట్రంప్ యుద్దం ఆపాల్సిందేనని, ఈ దిశగా భారత ప్రధాని అమెరికాపై ఒత్తిడి తేవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.






