- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులను చంపి సంబురాలు చేసుకుంటారా?.. కేంద్రంపై లెఫ్ట్ పార్టీలు సీరియస్
ఎన్ కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు నిర్వహించడం అమానవీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్ కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు నిర్వహించడం అమానవీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వీటిని సుమోటాగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని విజప్తి చేశారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. కగార్ ఆపరేషన్ పేరుతో ఈ దేశ ప్రజలైన 800 మందిని కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, చివరికి మావోయిస్టుల మృతదేహాలను కూడా వారి కుటుంబాలకు అప్పగించకుండా కేంద్రం అత్యంత కృరంగా వ్యవహరించిందన్నారు. ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కూడా ఇలాంటి అమానవీయమైన, అధర్మంతో కూడిన ఘటన చోటు చేసుకోలేదన్నారు. ఇది యుద్దం కాదని, ఏకపక్షంగా మావోయిస్టులను కాల్చి చంపుతున్నారన్నారు. ఇప్పుడు వారు అధికారంలో ఉన్నామని, ఏది చేసినా చెల్లుతుందని భావిస్తున్నారని కానీ ఏనాటికైనా ఈ ఘటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్రం గుర్తు ఉంచుకోవాలన్నారు.
మావోయిస్టులు తప్పులు చేస్తే వారిని చట్టబద్ధంగా శిక్షించే అధికారం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఉందని, కానీ ఇందుకు విరుద్ధంగా ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను చంపేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దేశ ప్రజలైన మావోయిస్టులను కాల్చి చంపి.. శత్రు దేశాలతో చర్చలు జరిపి.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంబురాలు చేసుకుంటారా? అని కూనంనేని మండిపడ్డారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ జరిగిన మరసటి రోజే ఆ స్థలాన్ని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్పొరేట్ కంపెనీకి దారదత్తం చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని కూనంనేని విమర్శించారు. అనంతరం సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ.. ఆదివాసీలు, మహిళలు, మావోయిస్టులను హత్య చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.






