పోటు రంగారావుకు నోటీసులు.. NIAపై వామపక్షాలు సీరియస్

by Gantepaka Srikanth |

సీపీఐ(ఎం.ఎల్) సూస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు సంబంధం లేని కేసులో విచారణకు రావాలని కోరుతూ ఎన్ఐఏ నోటీసు ఇవ్వడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండించాయి.

పోటు రంగారావుకు నోటీసులు.. NIAపై వామపక్షాలు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీపీఐ(ఎం.ఎల్) సూస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు సంబంధం లేని కేసులో విచారణకు రావాలని కోరుతూ ఎన్ఐఏ నోటీసు ఇవ్వడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండించాయి. ఈ ఎన్ఐఏ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. FIR No. RC04/2025/NIA/Hyd Dated 26 11 2025 U/S 152 of BNS, Section 13 & 39 of UA(D) Act 1967 కేసు విషయంలో విచారించడానికి ఈనెల 22న మాదాపూర్ కార్యాలయానికి హాజరుకావాలని కోరుతూ నోటీసు పంపించడం సరైందికాదని కాదన్నారు. ఈ మేరకు శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమ, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.సూర్యం, ఎంసీపీఐయూ నాయకులు గాదగోని రవి, ఎస్యూసీఐ నేత మురహరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సీపీఐ (ఎంఎల్) నేత ప్రసాదన్న, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి రమేష్ రాజా ఒక ప్రకటన విడుదల చేశారు.

పోటు రంగారావుకు ఎలాంటి సంబంధం లేదు..

‘వాస్తవానికి ఈ కేసుతో సీపీఐ (ఎంఎల్)మాస్ లైన్ పార్టీకిగానీ, రంగారావుకుగానీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ కేసు నంబరును పరిశీలించగా గాదె ఇన్నయ్యకు సంబంధించిన కేసు అని స్పష్టమైంది. గాదె ఇన్నయ్యను అరెస్టు చేస్తున్న విషయంలో పోలీసులు, రాజ్యం, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనీ, ఎవరికైనా ముందస్తు నోటీసులూ, ముందస్తు సమాచారం ఇవ్వాలనీ, ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా పోలీసులు అరెస్టు చేయడం సరియైనది కాదనీ, చట్టబద్ధంగా వ్యవహరించాలనీ, ఆ సందర్భంగా పోటు రంగారావు పత్రికా ముఖంగా కోరారు. సంఘటనను ఖండించారు. అంతకుమించి ఆ విషయంతో పోటు రంగారావుకు ఎలాంటి సంబంధం లేదు. కాని ఈ విషయంలో పోటు రంగారావుని విచారించడం అవసరం లేదని భావిస్తున్నాం. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం అణచివేతనూ, నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. రైతాంగ వ్యతిరేక చట్టాలను రుద్దాలని ప్రయత్నించింది. 29 చట్టాలను 4 కోట్లుగా మలిచి కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. నిరుద్యోగాన్ని పెంచుతున్నది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మందిని ఆదివాసులనూ, మావోయిస్టులను హత్య చేస్తున్నది. ఈ విషయమై వామపక్ష పార్టీలుగా ఉద్యమిస్తున్నాం. అణచివేతను ప్రశ్నిస్తున్నాం. మార్చి 31 తర్వాత ఆర్బన్ నక్సలైట్ల ఏరివేత ఉంటుందని మోడీ, అమిత్ షాలు చట్ట విరుద్ధంగా బాహాటంగానే ప్రకటిస్తున్నారు. అందులో భాగమే ఈ నోటీసు అని భావించాల్సి వస్తున్నది. పోటు రంగారావు విద్యార్థి దశ నుండే ఉద్యమాలు నిర్వహిస్తూ, నేడు అట్టడుగు ప్రజల విముక్తి కోసం పోరాడుతూ సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాంటి వారిపై నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఉపసంహరించాలని. డిమాండ్ చేస్తున్నాం. లేనిచో వాసుపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు తప్పవు’ అని వారు హెచ్చరించారు.

Next Story