పసుపు బోర్డు ఓకే.. నిధులేవీ?.. అమిత్ షాకు వామపక్ష నేతల ప్రశ్న

by Gantepaka Srikanth |

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఇబ్బంది కలిగించే లేబర్​కోడ్‌లను అమలు చేయాలని పూనుకుంటున్నదని, దీని దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జూలై 9వ తేదీన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పూనుకుంటున్నాయని, ఈ సమ్మెకు వామపక్ష

పసుపు బోర్డు ఓకే.. నిధులేవీ?.. అమిత్ షాకు వామపక్ష నేతల ప్రశ్న
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఇబ్బంది కలిగించే లేబర్​కోడ్‌లను అమలు చేయాలని పూనుకుంటున్నదని, దీని దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జూలై 9వ తేదీన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పూనుకుంటున్నాయని, ఈ సమ్మెకు వామపక్ష పార్టీలుగా మద్దతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్మికుల మౌళిక ప్రజాస్వామ్య హక్కులను కుదించడానికి ఉద్దేశించిన కార్పోరేట్​ఎజెండాలో కేంద్రం వెళుతోందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజెపీ ప్రభుత్వం తన నయా ఉదారవాద ఎజెండాను దూకుడుగా అమలు చేయాలని చూస్తోందని, అందులో లేబర్​కోడ్​లే ప్రధానంగా ఉన్నాయన్నారు. కీలకమైన జాతీయ వనరులను ముఖ్యంగా రక్షణ, కమ్యూనికేషన్​వంటి వ్యూహాత్మక రంగాలను ప్రైవేటీకరించే దిశగా చాలా వేగంగా కేంద్రం ముందుకు వెళుతోందన్నారు.

ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాలను అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కూనంనేని సాంబశివరావు అన్నారు. రైతాంగం వ్యవసాయ కార్మికులు, విస్కృత స్థాయిలో ప్రజానీకం వ్యక్తం చేస్తున్న ఆందోళనలతో సహా కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లను జూలై 9 నాటి ఎలిగెత్తి చాటుతుందని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. అనంతరం సీపీఐ(ఎం) సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ మాట్లాడుతూ.. జూలై 9 నాడు నిర్వహించే సార్వత్రిక సమ్మెకు తమతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్​మోర్చా ఇతర సంఘాలు పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నాయని, సమ్మె రోజు గ్రామాల్లో ప్రదర్శనలు , మండల కేంద్రాల్లో సభలకు పిలుపు నిస్తున్నామని జాన్​వెస్లీ వెల్లడించారు.

పసుపు బోర్డుకు నిధులేవి?: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

కేంద్ర మంత్రి అమిత్‌ షా వచ్చి నిజామాబాదులో పసుపుబోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం తప్ప, బోర్డు పనుల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమిత్‌ షా వస్తున్న సందర్భంగా ఎలాంటి నిరసనలకు, ఆందోళనలకు పిలుపులేకున్నా సీపీఐ(ఎం) నిజామాబాద్​జిల్లా కార్యదర్శి రమేష్‌బాబుతో పాటు, ఇతర వామపక్ష పార్టీల నాయకులనంతా ముందురోజే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే పద్ధతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జాన్​వెస్లీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మేము అధికారంలోకి రాబోతున్నామని అమిత్‌ షా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న సీట్లే గల్లంతవుతాయని, బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని గెలుస్తామని కలలుగంటుందో అర్థంకావడంలేదని పేర్కొన్నారు. నిజామాబాదు ప్రాంతంలో పసుపు ఎక్కువ ఉత్పత్తి అవుతుందని అమిత్‌షా చెప్పినప్పటికీ, ఈ బోర్డుకు కావాల్సిన యంత్రాలు తదితర పరికరాలకు ప్రతిపాదనలు గాని, కేటాయింపులు గానీ చేయలేదన్నారు పసుపు బోర్డు ప్రాంతంలోని రైతుల సమస్యలపై, కనీస మద్దతు ధరపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఇదే కాకుండా, రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుతో పాటు, జాతీయ హోదా కూడా ఇవ్వలేదన్నారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కూడా నిధుల కేటాయింపు చేయలేక పోయారని, అటు ఆదిలాబాదు జిల్లాలో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి బీజేపీ ఎంఎల్‌ఏగా గెలిచిన పాయల్‌శంకర్‌, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని జాన్​వెస్లీ విమర్శించారు. ఆదిలాబాదు అడవి ప్రాంతంతో పాటు, ఆసిఫాబాద్‌లోని 10 మండలాల్లో దాదాపు ఏడు లక్షల ఎకరాల భూమినంతా కాజేసీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి, గిరిజనులనంతా ఆ ప్రాంతాల నుంచి తరిమేసే కార్యక్రమానికి పూనుకుంటున్నదని జాన్​వెస్లీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోని తెచ్చిందని, రాష్ట్ర అభివృద్ధికి, హక్కులకు, నిధులకు, సామాజిక న్యాయానికి, రాష్ట్ర ప్రజానీకానికి పూర్తి వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో మతోన్మాద రాజకీయాలను కొనసాగిస్తున్న బీజేపీని ఓడించడానికి సీపీఐ(ఎం)తో సహా, ఇతర వామపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని జాన్​వెస్లీ పేర్కొన్నారు.

Next Story