కాంగ్రెస్ సమావేశంలో నేతల మధ్య గొడవ.. రాహుల్ యాత్రపై ఎఫెక్ట్!

by Disha Web |
కాంగ్రెస్ సమావేశంలో నేతల మధ్య గొడవ.. రాహుల్ యాత్రపై ఎఫెక్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను రాష్ట్రంలో సక్సెస్ చేయడానికి పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ సహా సీనియర్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. వరుస మీటింగులు నిర్వహిస్తూ గ్రాండ్ సక్సెస్ చేయడానికి స్కెచ్ వేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం నగరంలోని 'దస్‌పల్లా' హోటల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభ రసాభసగా మారింది. జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, అదే పార్టీ నేత సంజీవ్‌రెడ్డి మధ్య మాటలయుద్దం నడిచింది. రాహుల్ యాత్రను సక్సెస్ చేయడం సంగతి అటుంచితే వీరిద్దరి మధ్య పాత అంశానికి సంబంధించి డైలాగ్ వార్ చోటుచేసుకున్నది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోడానికి కారణం నువ్వంటే నువ్వు.. అంటూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. జోడో యాత్ర సంగతి గాలికెగిరిపోయింది.

చివరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దామోదర రాజనర్సింహ, మరికొందరు జోక్యం చేసుకుని వివాదాన్ని చల్లార్చారు. వీరిద్దరి మధ్య వాడివేడి ఆరోపణలు జరుగుతున్న సమయంలో మీడియా కూడా ఉన్న విషయాన్ని గమనించిన ఏఐసీసీ నదీమ్ జావెద్ జోక్యం చేసుకుని తొలుత జోడో యాత్ర సంగతి చూద్దామని, ఆ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉంటే మరో వేదిక మీద చర్చిద్దామని వారికి నచ్చచెప్పారు. రాష్ట్రంలోకి షెడ్యూలు కంటే ఒక రోజు ముందే (ఈ నెల 23న) చేరుకుంటున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రూట్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

హైదరాబాద్ నగరం మధ్య నుంచి యాత్ర సాగేలా రోడ్డు మ్యాప్ ఖరారైంది. మొత్తం ఏడు పార్లమెంటు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కవర్ అయ్యేలా 375 కి.మీ. మేర 14 రోజుల పాటు జరగనుంది. ఇప్పుడు సన్నాహక సమావేశాల్లోనే వీరిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో యాత్ర సమయంలో ఏమవుతుందోననే ఆందోళన ఉన్నా నివారించడానికి సీనియర్ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశముంది.


Next Story