జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి కీలక హామీ

by Gantepaka Srikanth |

జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి కీలక హామీ

జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy)ని కలిసి వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్‌‌లోని సచివాలయంలోని తన చాంబర్లో టీడబ్ల్యూజేఎఫ్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, పి.రాధిక, గుడిగ రఘు, కార్యదర్శి ఈ.చంద్రశేఖర్, హెచ్‌యూజే అధ్యక్షులు బి.అరుణ్ కుమార్, నాయకులు అచ్చిన ప్రశాంత్ తదితరులు మంత్రిని కలిశారు. దాదాపు గంటపాటు జర్నలిస్టుల సమస్యంపై చర్చించారు. వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇండ్లస్థలాల విషయంలో కొత్త విధానం తీసుకురావాలని మంత్రిని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇండ్లస్థలాల సమస్యలపై జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టుతో సమావేశం నిర్వహించి పరిష్కరించాలని కోరారు.

చనిపోయిన జర్నలిస్టులకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా..రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి అటాక్స్ కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి.. త్వరలో జర్నలిస్టుల సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఫెడరేషన్ నాయకులకు హామీ ఇచ్చారు. అంతకుముందు సమాచార శాఖ డైరెక్టర్ కిషోర్ బాబు, అదనపు డైరెక్టర్ డీఎస్ జగన్‌లను కలిసిన టి డబ్ల్యూ‌జే‌ఎఫ్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు.

Next Story