- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత చెంత నేతల జాతకాలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. రానున్న రోజుల్లో ఆమె ఎవరిని టార్గెట్ చేస్తారో, ఏం చెబుతారోనని అందరిలోనూ ఆందోళన నెలకొంది. నిన్నటిమొన్నటి వరకు కేవలం చిట్ చాట్ పేరుతో పార్టీ లీడర్లపై పరోక్షంగా విమర్శలు చేసిన ఆమె, ఒక్కసారిగా కీలక నేతలైన హరీశ్ రావు, సంతోష్ రావుపై అవినీతి ఆరోపణలకు దిగారు. దీనితో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కానీ కవిత మౌనంగా కూర్చోవడం కష్టమని, ఇకనుంచి మరిన్ని బాంబులు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
కవిత వద్ద అందరి జాతకాలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అక్రమాలు జరిగాయని, రూ.వేలాది కోట్లు దోచుకున్నారని ఇంతకాలం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆరోపించాయి. కానీ తాజాగా కవిత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, అందుకు హరీశ్ రావు, సంతోష్ రావు ప్రధాన కారణమని ఆమె చేసిన ఆరోపణలపై ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ఆమెపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి చేయడంతో కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే తనపై చర్యలు తీసుకోవడంతో కవిత కూడా మౌనంగా ఉండబోరని, మరింత దూకుడుగా వ్యవహరించే చాన్స్ ఉందని పార్టీలో కొందరు నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత సంపాదించారు? ఏ సబ్ కాంట్రాక్టు చేశారు? ఎక్కడ ఆస్తులు కూడబెట్టారు? అనే విషయాలపై పూర్తి డేటా ఆమె వద్ద ఉందని ప్రచారం ఉంది. సమయం, సందర్భం చూసుకుని ఒక్కొక్కరి జాతకాలను ఆమె బహిర్గతం చేస్తారని టాక్ ఉంది.
మరిన్ని బాంబులు రెడీ
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని గులాబీ లీడర్లపై ఆమె విసిరిన బాంబుకు ఆ పార్టీ లీడర్లు తేరుకోవడం లేదు. దీంతో ఉన్న పళంగా కవిత పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. కానీ కవిత వ్యవహారశైలిని దగ్గర నుంచి చూస్తున్న లీడర్లు మాత్రం ఆమె మరిన్ని బాంబులను విసిరేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రతి వ్యవహారం కవితకు తెలుసునని, ఆ గుట్టును బయటికి విప్పితే, ఒక్కో గులాబీ లీడర్ గిలగిల కొట్టుకోవడం ఖాయమంటున్నారు. అటు ఉద్యమం, ఇటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లీడర్ల వ్యవహారాలు మొత్తం ఆమెకు తెలుసు. ఈ పరంపరలో రానున్నరోజుల్లో ఆమె చేసే ఆరోపణలు ఆ పార్టీని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంటుంది.
Read More : రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీ..! సన్నిహితులతో కవిత సమాలోచనలు






