రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీ..! సన్నిహితులతో కవిత సమాలోచనలు

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం ఊహించిన పరిణామమే అయినప్పటికీ.. సొంత కూతురు పట్ల గులాబీ బాస్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకావాలు తక్కువే అని అంతా భావించారు.

రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీ..! సన్నిహితులతో కవిత సమాలోచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం ఊహించిన పరిణామమే అయినప్పటికీ.. సొంత కూతురు పట్ల గులాబీ బాస్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకావాలు తక్కువే అని అంతా భావించారు. కానీ.. పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్.. కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ తరఫున ప్రకటన రిలీజ్ చేయించారు. దీంతో మనస్తాపానికి గురైన కవిత.. తెలంగాణ జాగృతి కార్యాలయంలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టేందుకు ఆమె మొగ్గుచూపినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ పేరులో టీఆర్ఎస్ అని ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్‌కు పోటీగా టీఆర్ఎస్

కుటుంబసభ్యులు, అనుచరులు, జాగృతి కార్యకర్తలతో కవిత చేసిన డిస్కషన్‌లో అందరి నుంచి కొత్త పార్టీ అనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. అందుకే.. పూర్తిస్థాయిలో కసరత్తు చేసి త్వరలోనే ఆమె పార్టీ వివరాలను ప్రకటించనున్నట్టు తెలిసింది. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్‌ పేరుతో పుట్టుకొచ్చింది. ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటై చివరకు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. దాంతో అప్పటి నుంచి ఆ పార్టీ ప్రజలకు దూరం అయిందన్న ప్రచారం ఉంది. దాంతో మళ్లీ టీఆర్ఎస్ పేరిటనే పార్టీని స్థాపించి.. ప్రజల్లో నాటి సెంటిమెంట్‌ను తీసుకొచ్చేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. టీఆర్ఎస్ పేరును తెస్తేనే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్న ఆలోచనతో ఆమె ఉన్నారని సమాచారం. అందుకే.. టీఆర్ఎస్ అక్షరాలు కలిసేలా పార్టీ పేరు ఉండాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సొంత పార్టీ పెట్టేందుకు ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీసీ ఎజెండాతో కార్యక్రమాలు చేస్తున్న కవిత.. తన పార్టీ పేరులోనూ అదే నినాదం ప్రస్ఫుటించేలా ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ పేరును కవిత ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్‌పై రివేంజ్ తీర్చుకునేలా వ్యూహాత్మకంగా కవిత అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తున్నది.

నేడు పార్టీకి, పదవికి రాజీనామా

నేడు మధ్యాహ్నం కవిత మీడియా ముందుకు రాబోతున్నారు. ఇదే క్రమంలో పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించబోతున్నారని తెలిసింది. అంతేకాకుండా.. మరికొన్ని బాంబులు సైతం పేల్చబోతున్నారని టాక్. తనకు టార్గెట్ అయిన నేతల బండారం బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీశ్, సంతోష్‌ను టార్గెట్ చేసి చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. ఇక ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎలాంటి ని‘బంధనాలు’ అడ్డుపడే పరిస్థితి లేదు. దాంతో పార్టీలో జరుగుతున్న మరికొన్ని పరిణామాలు.. అవినీతి నేతల గుట్టు విప్పేందుకు సిద్ధం అయ్యారని తెలిసింది.

లేఖ లీక్ నుంచి ధిక్కార స్వరం

ఢిల్లీ మద్యం కేసులో కవిత అరస్టయి బయటకు వచ్చిన తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారని, అప్పుడప్పుడూ పార్టీకి వ్యతిరేకం అనిపించే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మే చివరలో ఆమె తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం కావడం కలకలం రేపింది. అందులో పార్టీలోని అనేక అంశాలను ప్రస్తావించారు. లేఖ బయటకు వచ్చిన సమాయంలో కవిత అమెరికాలో ఉన్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె పార్టీపై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు.

జాగృతితోనే ప్రజల్లోకి..

కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి సంస్థతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా జాగృతి కండువాలతోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే తన జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగారు. అందులో భాగంగానే సంస్థకు సంబంధించి పలు విభాగాలకు కమిటీలను ప్రకటించారు. ముందుగా సింగరేణిపై ప్రత్యేక ఫోకస్ చేసిన ఆమె సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్ని ఏరియాలకు ఇన్‌చార్జిలను ప్రకటించారు. అనంతరం హెచ్ఎంఎస్‌తో భాగస్వామ్యం అయ్యారు. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగానూ నియామకమయ్యారు. వీటి తర్వాత పలు దేశాలకు సంబంధించిన కన్వీనర్లనూ ప్రకటించారు. తాజాగా.. సస్పెన్షన్ నేపథ్యంలో ఇప్పటివరకు కవిత వెంట నడిచిన జాగృతి శ్రేణులు ఇకపై ఆమె బాటలోనే నడుస్తారా? లేక బీఆర్ఎస్ వైపు వెళ్తారా? అనేది వేచి చూడాలి.

నోటీసులు లేకుండానే సస్పెండ్

ఏ పార్టీలోనైనా నాయకుడు, కార్యకర్త పార్టీని ధిక్కరిస్తే ముందుగా నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరుతారు. కానీ, బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచీ ఆ సంస్కృతి లేకుండా పోయింది. తాజాగా కవిత విషయంలోనూ అదే రిపీట్ అయింది. ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలివ్వడాన్ని జాగృతి నేతలు తప్పుపట్టారు. గతంలోనూ పార్టీలో కీలక వ్యక్తులైన ఆలె నరేంద్ర, గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఈటల రాజేందర్, రహమాన్‌ను సైతం ఇలాగే పార్టీ నుంచి పంపించేశారు.

కవిత ధిక్కారస్వరం ఇలా..

మే 22: కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ అయింది. ఆ సమయంలో ఆమె అమెరికా పర్యటనలో ఉన్నారు.

మే 23: అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే మీడియాతో మాట్లాడారు. లేఖ రాసింది తానేనని.. అది ఎలా బయటకు వచ్చిందో తేలాలంటూ పెద్ద బాంబే పేల్చారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు.

జూన్ 05: కాళేశ్వరంపై విచారణకు హాజరుకావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కవిత ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీతో సంబంధం లేకుండానే ఆమె ఈ కార్యక్రమం తీసుకున్నారు. కేసీఆర్‌కు నోటీసులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంపై విమర్శలు చేశారు. ఆందోళనలకు పిలుపునివ్వకపోవడం.. రాష్ట్ర బంద్ చేపట్టకపోవడంపై నిలదీశారు.

జూన్ 16: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ ముందు హాజరయ్యారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగానూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. కొంత మంది కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత ఏసీబీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. కవిత మాత్రం ఆ రోజు జగిత్యాల పర్యటనకు వెళ్లారు.

జూలై 13: కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా.. దీనిపై బీఆర్ఎస్ స్పందింకపోవడంపై కవిత సీరియస్ అయ్యారు. పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

జూలై 26: ఉప్పల్‌లో బీఆర్ఎస్‌వీ నాయకులకు పార్టీ తరఫున సమావేశం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించాలని పీపీటీ నిర్వహించారు. అదే రోజు హైదరాబాద్‌లోని కొంపల్లిలో అదే రోజు కవిత జాగృతి నేతలకు ‘లీడర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది.

ఆగస్టు 3 : తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కవిత.. మాజీమంత్రి జగదీశ్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఆయన లిల్లిపుట్ నాయకుడు అంటూ సంబోధించారు. ఆయన వల్లే నల్గొండలో పార్టీ ఓడిపోయిందని చేసిన కామెంట్ వైరలయ్యాయి.

ఆగస్టు 4 : బీఆర్ఎస్‌తో సంబంధం లేకుండా కవిత బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద 72 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు గులాబీ పార్టీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. ఆ కార్యక్రమంలో జై బీసీ.. జై జాగృతి అంటూ కవిత నినదించారు. కానీ బీఆర్ఎస్ పేరు ఎత్తలేదు.

సెప్టెంబర్ 1: కాళేశ్వరం కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా పరిగణించిన కవిత.. మాజీమంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావును టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ అవినీతి అనకొండలని, వీరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందన్నారు.

Next Story