- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా, శిశు సంక్షేమ పథకాల్లో అధికారుల అలసత్వం
మహిళా, శిశు సంక్షేమ నిధుల వినియోగంలో అధికారుల నిర్లక్ష్యం.. బేటీ బచావో పథకంలో 10 జిల్లాల వ్యయం జీరో, పోషకాహార పథకంలో వరంగల్ రూరల్ లాస్ట్!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళలు, బాలల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంలో జిల్లాల వారీగా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాలు కేటాయించిన నిధులను వందశాతం సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలుస్తుంటే, మరికొన్ని జిల్లాలు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నిస్తేజంగా ఉండిపోతున్నాయి. బేటీ బచావో బేటీ పఢావో, చైల్డ్ హెల్ప్‌లైన్, సంపూర్ణ పోషకాహార పథకం, మిషన్ వాత్సల్య, వన్ స్టాప్ సెంటర్లు వంటి కీలక పథకాలకు సంబంధించిన బడ్జెట్ విడుదల, వాస్తవ ఖర్చుల గణాంకాలను పరిశీలిస్తే ఈ చేదు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
‘బేటీ బచావో’.. 10 జిల్లాల్లో సున్నా..
బాలికల రక్షణ, విద్య ధ్యేయంగా ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో బేటీ పఢావో’ పథకం కింద ఎంపిక చేసిన జిల్లాలకు సమానంగా రూ.4,69,696 చొప్పున నిధులు విడుదలయ్యాయి. నిధులు చేతికి అందినా రాష్ట్రంలోని 10 ప్రధాన జిల్లాలు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోయాయి. జనగామ, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జగిత్యాల జిల్లాలు సున్నా వ్యయంతో అత్యంత వెనుకబడి ఉన్నాయి. మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు కేటాయించిన రూ.4,69,696 నిధులను 100 శాతం ఖర్చు చేశాయి.
చైల్డ్ హెల్ప్ లైన్.. స్పందించని ఆఫీసర్లు..
ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునే చైల్డ్ హెల్ప్‌లైన్ విభాగంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అత్యధికంగా రూ.5,01,416, రాజన్న సిరిసిల్లకు రూ.4,87,627, కరీంనగర్‌కు రూ.4,44,603 నిధులు విడుదలైనప్పటికీ అక్కడ వ్యయం సున్నా శాతంగానే నమోదైంది. నారాయణపేట, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు సైతం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. హైదరాబాద్ జిల్లా మాత్రం రూ.3,34,283 విడుదల చేస్తే పూర్తిస్థాయిలో 100 శాతం నిధులను వినియోగించి అగ్రస్థానంలో నిలిచింది.
సంపూర్ణ పోషకాహార పథకం ఇలా..
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించే కీలకమైన ఎస్‌ఎన్‌పీలో నిధుల ఖర్చు నెమ్మదిగా సాగుతోంది. ఈ పథకంలో వరంగల్ రూరల్ జిల్లా రూ.1.03 కోట్లకు పైగా నిధులు పొంది, కేవలం రూ.12.92 లక్షలు (13 శాతం) మాత్రమే ఖర్చు చేసి రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. సిద్దిపేట (21 శాతం), రాజన్న-సిరిసిల్ల (21 శాతం), సూర్యాపేట (25 శాతం) జిల్లాలు కూడా 30 శాతం కంటే తక్కువ వ్యయంతో వెనుకబడ్డాయి. నిర్మల్ జిల్లా రూ.1.51 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.1.42 కోట్లు (94 శాతం) ఖర్చు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.
మిషన్ వాత్సల్య, వన్‌స్టాప్ సెంటర్లు..
అనాథలు, వీధిన పడిన పిల్లల సంరక్షణకు ఉద్దేశించిన మిషన్ వాత్సల్య కింద సూర్యాపేట (82.7 శాతం), వరంగల్ (82.1 శాతం), మహబూబ్‌నగర్ (78.3 శాతం) నిధుల వినియోగంలో ముందంజలో ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూ.12.23 లక్షల నిధులు కలిగి ఉండి కూడా సున్నా వ్యయంతో చివరి స్థానంలో నిలిచిపోయింది. మహిళలపై హింస నివారణకు ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ సెంటర్ల’ బడ్జెట్ పరిశీలిస్తే.. హైదరాబాద్ జిల్లా కేటాయించిన రూ.9,13,400 నిధులను పూర్తిగా 100 శాతం వినియోగించింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు జీరో సున్నా వ్యయాన్ని నమోదు చేశాయి. జనగామ, రంగారెడ్డి, ములుగు జిల్లాల అధికారులు బడ్జెట్‌ను ఖర్చు చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శించారు.






