- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరెంట్స్ సంక్షేమం చట్టం అమలులో అలసత్వం!
రేవంత్ సర్కార్ తల్లిదండ్రుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతగా చట్టాన్ని తీసుకురాగా.. చట్టం అమలులో అలసత్వం కొనసాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వాలు తెచ్చే చట్టాలు కార్యరూపం దాల్చాలంటే ఉన్నతాధికారుల చిత్తశుద్ధి, పనితీరు, వేగవంతమైన సేవలు అవసరం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చేసే చట్టాలు అమలు కావాలంటే మార్గదర్శకాలు, జీవోలు విడుదల కావాల్సి ఉంటుంది. దాంతో అవి క్షేత్రస్థాయిలో అమలవుతాయి. వాటి ఫలితాలు, ఫలాలు ప్రజలకు అందుతాయి. అయితే, రేవంత్ సర్కార్ తల్లిదండ్రుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతగా చట్టాన్ని తీసుకువచ్చింది. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో ఈ చట్టం చేశారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పేరెంట్స్ సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదని గత కొన్నేండ్లుగా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. పిల్లలు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నా... కన్నవారి గురించి పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చి 29న దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు గవర్నర్ఆమోదముద్ర వేశారు. ఈ చట్టం లక్ష్యాన్ని, సంకల్పాన్ని అన్ని వర్గాల ప్రజలు హర్షించారు. మావన సంబంధాలు మంటగలుస్తున్న ఈ తరుణంలో బిల్లులు తెచ్చి తల్లిదండ్రుల సంరక్షణ చూడాలని చెప్పాల్సి రావడం బాధకరమే అయినా.. తప్పడం లేదని ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని, పిల్లలు భక్తితో కాకపోయినా భయం తోనైనా.. తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే తమ ప్రయత్నమని సీఎం రేవంత్ స్పష్టంచేశారు.
పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా దారపోస్తారని, పిల్లలు మాత్రం రెక్కలొచ్చాక పేరెంట్స్‌ను పట్టించుకోవడం లేదని సీఎం మండిపడ్డారు. తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చినట్టు సీఎం వెల్లడించారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వారిని సామాజికంగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2007లో వృద్ధుల కోసం కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది, దాని ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించకుండా ఇవ్వాలి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో రూ.10 వేలు లేదా వేతనంలో 15 శాతం కోత విధించి ఆ డబ్బులను పేరెంట్స్ సంక్షోమం కోసం వినియోగిస్తుంటారు.
రాష్ట్ర స్థాయిలో కమిషన్..
బిల్లు చట్టం రూపం దాల్చి 100 రోజులు దాటింది. అయినా చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన కసరత్తు మాత్రం ఇంతవరకు జరగడం లేదు. మార్గదర్శకాలు ఇంతవరకు జారీ కాలేదు. చట్టం అమలు చేయడానికి జిల్లా, డివిజన్, రాష్ట్ర స్థాయి అధికారుల పరిధి, విధులు, బాధ్యతలు తదితర వాటిని పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది. చట్టం అమలు కోసం రాష్ట్రస్థాయిలో కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవి ఏవీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆర్డీవోలకు అధికారాలను కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. అందుకే రాష్ట్రస్థాయిలో కమిషన్‌ఏర్పాటు చేశారు. మొదట ప్రభుత్వ ఉద్యోగులే అనుకున్నా.. ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగులు, చట్టసభల ప్రజాప్రతినిధులతో పాటుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనూ ఇందులో భాగస్వాములను చేశారు.
ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చితేనే వారికి జవాబుదారితనం ఉంటుందని, వారే 10 మందికి చెప్పేవారని.. అందుకే వారు కూడా ఈ రూల్స్ ఫాలో అవ్వాలని సీఎం ఉద్దేశించారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కనీసం సింగిల్ డిజిట్‌లో వృద్ధ తల్లిదండ్రులు ఆ కార్యక్రమానికి వచ్చి తమ కొడుకులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. కాగా, చట్టం అమలుకు మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో జిల్లా అధికారులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఇదేంటని అడిగితే సచివాలయం నుంచి మార్గదర్శకాలు రాలేదని వారు సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది.






