తహసీల్దార్‌కు బిగ్ షాక్.. ఆఫీసుకు తాళం వేసిన జంట

by Bhoopathi Nagaiah |

తహసీల్దార్‌కు బిగ్ షాక్.. ఆఫీసుకు తాళం వేసిన జంట
X

దిశ, రాజాపూర్ : ఇంటి అద్దెలపై ఆధారపడే చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ ఇంటిపై చేసిన అప్పులను వచ్చే కిరాయిల డబ్బులతోనే తీర్చుకుంటున్నారు. రెంట్‌కు ఉన్న వాళ్లు ఒకటి, రెండు నెలలు అద్దెలు ఆపితే వెంటనే ఇల్లు ఖాళీ చేయిస్తారు. సామాన్లను నడివీధిలోకి విసిరేస్తారు. కానీ నెలల తరబడి అద్దె చెల్లించకపోతే ఆ ఇంటి యజమాని పరిస్థితి ఏంటి..? రెంట్లపైనే ఆధారపడిన ఆ ఓనర్ ఎలా బతకాలి..? ఇదే జరిగింది రాజాపూర్ మండల కేంద్రంలో.. ఇంటిని తహసీల్దార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చిన పాపానికి ఆ యజమాని రోడ్డున పాడాల్సి వచ్చింది. ఒల్లుమండిన ఇంటి ఓనర్ ఏకంగా తహసీల్దార్ ఆఫీసుకు తాళం వేశాడు.

రాజాపూర్ తహసీల్దార్ కార్యాలయం గత కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతుంది. అయితే అధికారులు ఇంటి యజమానికి కొన్ని నెలలుగా అద్దె చెల్లించకుండా ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ. 2.50 లక్షల అద్దె బకాయి పేరుకుపోయింది. అయినా ఈ నెల, ఆ నెల అని అధికారులు తిప్పించుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన ఇంటి ఓనర్ శ్రీనివాస్ ఇవాళ (సోమవారం) ఉదయం భార్యతో కలిసి తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. అధికారులు భూభారతి అవగాహన కార్యాక్రమానికి వెళ్లడంతో ఆఫీసు గేటుకు తాళం వేశాడు. ఎవరినీ లోపలికి పోకుండా గేటు వద్దే అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది, ఎస్ఐ శివానంద్, కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంటి యజమానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఇంటి ఓనర్ తనకు లక్షల్లో బకాయి పడ్డారని, నేను అప్పుల పాలవుతున్నానని కంటపడి పెట్టుకున్నాడు. నెలల తరబడి అద్దె చెల్లించకుంటే నేను, నా కుటుంబం ఎలా బతకాలని కన్నీటిపర్యంతం అయ్యాడు.

ఎస్ఐ శివానంద్ జోక్యం చేసుకోని అద్దె బకాయి చెల్లించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన ఇంటి యజమాని తహసీల్దార్ కార్యాలయానికి వేసిన తాళాన్ని తీసి వెళ్లిపోయారు. దీంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయింది.

Next Story