- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెట్టింపైన భూ విలువలు.. సామాన్యుడికి రిజిస్ట్రేషన్ మరింత భారమే!
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను భారీగా పెంచడంతో రిజిస్ట్రేషన్ల ఖర్చు సామాన్యులకు తడిసిమోపెడైంది. పెరిగిన భూమి మార్కెట్ ధరలు జూన్ 05 (శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.

రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను భారీగా పెంచడంతో రిజిస్ట్రేషన్ల ఖర్చు సామాన్యులకు తడిసిమోపెడైంది. పెరిగిన భూమి మార్కెట్ ధరలు జూన్ 05 (శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ చార్జీల శాతం (7.5శాతం) మారనప్పటికీ, భూమి విలువ రెట్టింపు కావడంతో ఫీజుల భారం కూడా రెట్టింపయింది. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పెరిగాయి. వారం కింద రూ.28,700 ఉన్న రిజిస్ట్రేషన్ ఖర్చు.. ప్రస్తుతం కొత్త ధరల ప్రకారం రూ.56 వేల పైకి చేరింది. ప్రభుత్వం ధరలు ఏమైనా తగ్గిస్తుందేమోననే ఆశతో గ్రామీణ ప్రాంతాల జనం రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉంటున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను అమాంతంగా పెంచేయడంతో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. దీంతో భూముల రిజిస్ట్రేషన్ల ఖర్చు సామాన్యులకు తడిసిమోపెడైంది. ప్రభుత్వం భూముల విలువను ఏకంగా రెట్టింపు చేయడంతో ఆ భారాన్ని భరించలేక సామాన్య కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరిగే నిజామాబాద్ జిల్లాలో ఈ భూముల విలువ పెరగడం బడా వ్యాపారులపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, సామాన్య కొనుగోలుదారుల నడ్డి విరిచేలా ఉంది. పెరిగిన భూమి విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి రావడంతో మొదటి రోజు జిల్లాలో రిజిస్ట్రేషన్లు అంతంత మాత్రంగానే జరిగాయి.
చార్జీలు అవే.. కానీ భారం రెట్టింపు!
రిజిస్ట్రేషన్ చార్జీల శాతంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే 5.5శాతం డీఎస్‌డీ (DSD), 2.0 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.500 కామన్ యూజర్ చార్జెస్, 1.0 శాతం మ్యుటేషన్ చార్జీలను వసూలు చేస్తున్నారు. మొత్తం మీద మార్కెట్ విలువపై విధించే 7.5శాతం చార్జీల శాతాన్ని పెంచనప్పటికీ, అసలు భూమి మార్కెట్ వాల్యూను రెట్టింపు చేయడంతో దానికి అనుగుణంగా చెల్లించాల్సిన చార్జీల మొత్తం కూడా రెట్టింపవుతోంది. దీంతో వినియోగదారుడిపై ఆర్థిక భారం అమాంతం పెరిగింది. పెరిగిన ధరల కారణంగా మొదటి రోజు రిజిస్ట్రేషన్లపై జనం అంతగా ఆసక్తి కనబరచలేదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
జీవితాంతం కష్టపడి, పైసా పైసా కూడబెట్టి సొంతంగా ఒక ఇంటి స్థలం కొనుక్కున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సామాన్యులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు నెలల కింద భీమ్‌గల్ పట్టణంలో వాయిదాల (కిస్తుల) పద్ధతిపై ఒక ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు. వారం రోజుల కిందట రిజిస్ట్రేషన్ చార్జీలు లెక్కేసినప్పుడు రూ.28,700 కాగా, కొత్త ధరల ప్రకారం అది ఇప్పుడు ఏకంగా రూ.56వేల పైకి ఎగబాకిందని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మనసొప్పడం లేదని, ప్రభుత్వం ఏమైనా ధరలు తగ్గిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నట్లు సదరు కొనుగోలుదారుడు అమాయకంగా చెబుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే చాలా మంది కొనుగోలుదారులు.. కొద్ది రోజులు ఆగితే ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలు తగ్గిస్తుందేమోననే ఆశతోనే రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నట్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఉన్న డాక్యుమెంట్ రైటర్లు పేర్కొంటున్నారు.






