- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నత్తనడకన భూ సమస్యల పరిష్కారం.. తహసీల్దార్లు Vs ఆర్డీవోలు
భూ సమస్యల పరిష్కారంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చితే వారం లోపే క్లియర్ చేస్తున్నారు. లేకుంటే నెలల తరబడి ఫైళ్లు పెండింగులో ఉంటున్నాయి. తహసీల్దార్ సిఫారసు చేస్తే ఆర్డీవో, అక్కడా ఆమోదం లభిస్తే అడిషనల్ కలెక్టర్.. ఆయన అప్రూవ్ చేసినా కలెక్టర్.. ఆ తర్వాత సీసీఎల్ఏలో ఆగిపోతున్నాయి. ఒక్కొక్కరి దగ్గర నెలల తరబడి ఫైళ్లు మూలుగుతున్నాయి. మూడు నెలల నుంచి ఒక్క ఫైల్ చూడని కలెక్టర్లు కూడా ఉన్నారు. రెండేండ్ల నుంచి రిజెక్ట్ చేస్తూ తిప్పించుకుంటున్న అధికారులు ఉన్నారు. ఇవన్నీ భూ రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులే చేసిన తప్పుల సవరణకు పెట్టుకున్న అర్జీలే. ఇదిలాగే కొనసాగితే ప్రభుత్వం బద్నాం అవుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం గమనార్హం. భూ భారతి అమలుకు ముందే పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
తహసీల్దార్ వర్సెస్ ఆర్డీవో
హెచ్ఎండీఏ పరిధిలోని ఓ జిల్లాలో తహసీల్దార్, ఆర్డీవోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. అందుకే తహసీల్దార్ రికమండ్ చేసిన ప్రతి ఫైల్ ను పెండింగ్ పెడుతున్నారనే చర్చ జరుగుతున్నది. దరఖాస్తుదారులను ఆర్డీవోలు ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడుతున్నారని సమాచారం. ఇటీవల ఆ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పెండింగ్ దరఖాస్తుల మీద సీరియస్ అయ్యారు. ఆర్డీవో దగ్గర ఎక్కువగా ఉండడంతో మందలించారని తెలిసింది. అయితే తానేం చేయాలని, తహసీల్దార్ రిపోర్టులు సరిగా పంపడం లేదని ఫిర్యాదు చేశారని రెవెన్యూ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. కొన్ని నెలలుగా సదరు తహసీల్దార్ ఏ ఫైల్ పంపినా.. ఆర్డీవో సంతృప్తి చెందడం లేదని విశ్వసనీయ సమాచారం. ఎలాగూ కొద్ది రోజుల్లో పదోన్నతి వస్తుందన్న ఆశాభావంతో ఉన్న సదరు తహసీల్దార్ మౌనం వహిస్తున్నట్లు చర్చ నడుస్తున్నది. భూ సమస్యల ఫైళ్లపై ఇలా చాలా చోట్ల జరుగుతున్నది.
ప్రధానంగా టీఎం 33, టీఎం 15 ఫైళ్లల్లో మండలంలో దందా నడుస్తుందని ఆర్డీవోలు భావిస్తున్నారు. అది తమ దాకా రాకపోవడంతోనే దరఖాస్తుదారులను ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అదనపు కలెక్టర్లు సుదీర్ఘ కాలం దరఖాస్తులను పెండింగులో ఉంచుకుంటున్నారు. ఇదిలాగే కొనసాగితే భూ సమస్యల పరిష్కారం వేగం పెరగడం కంటే అవినీతి, ఆరోపణలు పెరుగుతాయన్న అభిప్రాయం నెలకొన్నది. ఓ జిల్లాలో ప్రభుత్వం భూ సేకరణ కింద సేకరించిన దాని కంటే అత్యధికంగా తొలగించారు.. అవార్డ్ కాపీ చూసి సుమోటోగా సరిదిద్దాల్సిన డేటాను ఐడేండ్లయినా అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు రిజెక్ట్ చేశారు. తహసీల్దార్ పంపిన రిపోర్టును రెండు సార్లు ఆర్డీవో, రెండు సార్లు అదనపు కలెక్టర్లు మార్పించారు. వాళ్లిద్దరూ రికమండ్ చేసి మూడు నెలలైనా కలెక్టర్ ఫైల్ చూడడం లేదు. సదరు కలెక్టర్ కు ‘సూపర్ పవర్’ అన్న పేరు ఉండడంతో ఫైళ్లు చూడమని రిక్వెస్ట్ చేసే ధైర్యం కూడా ఎవరూ చేయడం లేదు. పలు జిల్లాల్లో కలెక్టర్లు పీవోబీ, డేటా కరెక్షన్ ఫైళ్లను సుదీర్ఘ కాలంగా పెండింగు పెట్టడంతో దరఖాస్తుదారులు తిరుగుతూనే ఉన్నారు.
ఇష్టం లేకపోతే..
అధికారులు సంతృప్తి చెందితే సమగ్రంగా రిపోర్టులు పంపిస్తున్నారు. ఒకవేళ దరఖాస్తుదారుడు చెప్పింది చేయకపోతే మరోలా రిపోర్టులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్రూవ్ చేసినట్లుగానే ఉంటున్నా.. రిపోర్టులో మాత్రం పూర్తిస్థాయి పరిష్కారం ఉండడం లేదు. కొందరు కలెక్టర్లు అప్రూవ్ చేసిన డేటా కరెక్షన్ ఫైళ్లను సీసీఎల్ఏ నుంచి తిప్పి పంపిస్తున్నారు. లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు. కలెక్టర్ అప్రూవ్ చేసినా.. సీసీఎల్ఏ రిజెక్ట్ చేయడానికి గల కారణాలేమిటని ఆరా తీస్తే.. ఆర్ఎస్ఆర్ తేడా ఉందని చెప్పేస్తున్నారు. మరి అది సరి చేయాల్సిన బాధ్యత అధికారులదే కదా! అంటే ఆ పని కలెక్టర్ స్థాయిలోనే పూర్తి కావాలి. తమకేం సంబంధమని సీసీఎల్ఏ సిబ్బంది ఏకపక్షంగా రిజెక్ట్ కొడుతున్నారు. నిజానికి ఆర్ఎస్ఆర్ తేడా ఎక్కడ ఉంది? ఎవరి ఖాతాలో అధికంగా ఉందో గుర్తించాలి? ఆ ఖాతాదారుడి వివరాలను చెక్ చేయాలి? సమగ్రంగా రిపోర్ట్ పంపాల్సిన బాధ్యత తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ల మీద ఉంది. ఈ పని నాలుగు స్థాయిలోనూ చేయకుండానే సీసీఎల్ఏకు పంపిస్తుండడంతో టీఎం-33 ఫైళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. అధికారులకు నచ్చిన ఫైళ్లు వస్తే.. దరఖాస్తు చేసుకున్న వారంలోపే క్లియర్ అవుతున్నాయి. ఇలా ప్రతి జిల్లాలోనూ కొన్ని వందలాది ఫైళ్లు ఉంటాయి.
సరిదిద్దాల్సిన బాధ్యత అధికారులదే
సర్వే నంబర్లు మిస్సింగ్, విస్తీర్ణం తక్కువ పడిందని వచ్చే అప్లికేషన్లకు పరిష్కారమే లేదన్నట్లుగా రెవెన్యూ అధికారులు అబద్దాలు చెబుతున్నారు. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. కానీ రికార్డులను వెరిఫై చేయకుండానే ఆ సర్వే నంబరులో మొత్తం విస్తీర్ణం ఎంత? ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో ఎంత ఉంది? ఇంత వరకే చూసి తిరస్కరిస్తున్నారు. నిజానికి ఆ రైతుకు భూమి ఉందా? లేదా? మోఖా మీద ఎవరు ఉన్నారు? పాసు బుక్ లో ఎంత ఉంది? గ్రౌండ్ లో ఎంత ఉంది? అనే విషయాలను పట్టించుకోవడం లేదు. కనీసం రికార్డులను పరిశీలిస్తే వాటిలో డమ్మీ ఖాతాలు కూడా దర్శనమిస్తున్నాయి. వాటిని డిలీట్ చేస్తే అసలైన రైతుకు న్యాయం జరుగుతుంది.
కానీ, తమకేం అధికారం లేదంటూ తహసీల్దార్లు తప్పించుకుంటున్నారు. ఆఖరికి రెండు గుంటల వేరియేషన్ ఫైల్ కూడా సీసీఎల్ఏ దాకా పంపిస్తున్నారు. నిజానికి తహసీల్దార్లకు అధికారం ఉంది. ఏ సర్వే నంబర్ ఎందుకు మిస్ అయ్యింది? విస్తీర్ణం ఎందుకు తక్కువగా పడింది? రిపోర్ట్ పంపిస్తే సరిదిద్దే వ్యవస్థ ఉంది. కానీ అంతా సీసీఎల్ఏ చేతిలోనే ఉందంటూ తహసీల్దార్లు, కలెక్టర్లు దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు. ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే దాటవేత ధోరణితో చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీఎల్ఏలోనూ మండల స్థాయిలోనే రిపోర్ట్ పంపిస్తే ఈజీగా పరిష్కారమయ్యే దరఖాస్తులను హైదరాబాద్ దాకా పంపిస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. 30 నిమిషాలు పాత రికార్డులన్నీ పరిశీలించి వాస్తవాలను రాసి పంపేందుకు ఇష్టపడడం లేదు. అందుకే టీఎం 33 అప్లికేషన్లు ఏండ్ల తరబడి పెండింగులోనే ఉంటున్నాయి.
బీఆర్ఎస్‌లో హయాంలో అవినీతి: మన్నె నర్సింహారెడ్డి, సామాజిక కార్యకర్త
భూ భారతి పోర్టల్ లో ఉంచిన డేటా కంప్లీట్ గా ధరణి డేటానే. ధరణి పోర్టర్ డేటా తప్పుల తడకగా ఉండడంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అధికారులు మళ్లీ అదే డేటాను భూ భారతిలోకి గంపగుత్తగా బదిలీ చేశారు. ధరణి పోర్టల్ ఐజీఆర్ఎస్ సైట్ లో ప్రొహిబిటెడ్ లో ఉన్న సర్వే నంబర్లను బ్లాక్ చేసింది. ప్రస్తుతం భూ భారతి డేటాలో కూడా ధరణి ఉన్న డేటాను డంపు చేయడం వల్ల ‘టీఎం 15 లో దరఖాస్తు చేయండి. ప్రొహిబిటెడ్ లో ఉంటే తొలగిస్తాం’ అని చూపిస్తుంది. దరఖాస్తు క్లియర్ గా ఉన్న ప్రాపర్టీస్ ను ప్రొహిబిటెడ్ లో పెట్టి కలెక్టర్లు ఇష్టం వచ్చినట్లుగా అవినీతికి పాల్పడుతున్నారు. వారిని చూసి ఆర్డీవోలు, తహసీల్దార్లు అందిన కాడికి దోచుకుంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటివి లెక్కలేనన్ని జరిగాయి. ప్రస్తుతం భూ భారతి పోర్టల్ లో ఉన్న ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ సమస్య పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ పెట్టడం బెటర్. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నించవద్దు. భూ భారతిలో వచ్చిన డేటాను పూర్తిగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి.






