లోతుకుంట భూ వ్యవహారం.. హైకోర్టుకు హైడ్రా చీఫ్ క్షమాపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-27 10:49:49  IST  )

తెలంగాణ హైకోర్టుకు హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు.

లోతుకుంట భూ వ్యవహారం.. హైకోర్టుకు హైడ్రా చీఫ్ క్షమాపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. కోర్టులు, దేశ న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం, అత్యున్నత గౌరవం ఉన్నాయని అందులో పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చి, అబద్ధ కథనాలు కల్పించి పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. న్యాయస్థానాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుతూ, ఇప్పటివరకు జరిగిన పరిణామాలకు గాను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు?

ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తుచేసింది. ‘ఒకే ఒక్క అధికారిపై, ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలను పాటించకుండా, కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కనబెట్టి వ్యవహరించడం వల్లే కదా ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి?’ అని ధర్మాసనం రంగనాథ్‌ను, ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది.

Next Story