లాల్ దర్వాజ బోనాలకు ముస్తాబైన పాతబస్తీ.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

by Naga Rani Yarlagadda |

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించే లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల వేడుకలకు వేళైంది.

లాల్ దర్వాజ బోనాలకు ముస్తాబైన పాతబస్తీ.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించే లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల వేడుకలకు వేళైంది. ఇందుకోసం పాతబస్తీ ముస్తాబైంది. ఈ ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయాలు, వీధులను శోభాయమానంగా అలంకరించారు. లాల్ దర్వాజ మోడ్ , చత్రినాక, గౌలిపురా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్వాగత వేదికలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బోనాల వేడుకల సందర్భంగా పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సింహవాహిని అమ్మవారి బోనాల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో శివసత్తులు, పోతరాజుల నృత్యాల మద్య నైవేద్యం సమర్పిస్తారు.

ఆలయాల ముస్తాబు..

పాతబస్తీ బోనాలను పురస్కరించుకొని లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం, హరిబౌళి అక్కన్నమాదన్న ఆలయం, బంగారు మైసమ్మ, చందులాల్ బేలా ముత్యాలమ్మ, సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ, నల్లపోచమ్మ, గౌలిపురా మాతేశ్వరి ఆలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి, చాంద్రాయణ్ గుట్ట శ్రీదేవి, కుమ్మర్ వాడి శ్రీ కనకదుర్గ ఆలయం, మురాద్ మహల్ శ్రీ మహంకాళి తదితర ఆలయాలను పూలు, పచ్చని తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సమాచార ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

పటిష్ట పోలీస్ బందోస్తు..

పాతబస్తీలో ఆదివారం జరిగే బోనల ఉత్సవాల్లో పలువురు మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రతినిధులు, సెటబ్రిటీలు పాల్గొననున్నారు. దీంతో పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. దక్షిణ మండలం డీసీపీ ఆధ్వర్యంలో ఛత్రినాక, షాలిబండ, ఫలక్ నుమా, మొఘల్ పురా, చాంద్రాయణ్ గుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారు.

ట్రాఫిక్ దారి మళ్లింపు..

పాతబస్తీలో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆయా ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర జాయింట్‌ కమిషనర్‌ (ట్రాఫిక్) జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

లాల్‌ దర్వాజ ఆలయం పరిసరాల్లో..

లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో నిర్వహించే బోనాల సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇక్కడ సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. ఇంజన్‌బౌలి, ఫలక్‌నుమా వైపు నుంచి ఆలియాబాద్‌ వైపునకు వచ్చే వాహనాలను న్యూ షంషేర్‌గంజ్‌ నుంచి గోశాల, మిస్రీగంజ్‌ వైపునకు మళ్లిస్తారు. మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్‌ నుంచి ఆలియాబాద్‌ వైపునకు వచ్చే వాహనాలను ఇంజన్‌బౌలి నుంచి జమనుమా, గోశాల వైపునుకు డైవర్ట్‌ చేస్తారు. నాగులచింత, సుధాటాకీస్‌ వైపు నుంచి లాల్‌దర్వాజా వైపునకు వచ్చే వాహనాలను గౌలిపురా వైపునకు మళ్లిస్తారు. చార్మినార్‌ వైపు నుంచి నల్లచింత వైపునకు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్‌ వైపు వెళ్లాలని ఆయన తెలిపారు.

వాహనాల పార్కింగ్..

ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు షాలిబండ ప్రధాన రోడ్‌పై, ఆర్యవైశ్యమందిర్‌, వీడీపీ స్కూల్‌ గ్రౌండ్‌, మిత్రా స్పోర్ట్స్‌ క్లబ్‌, చార్మినార్‌ బస్‌టర్మినల్‌, ఢిల్లీగేట్‌ వద్ద పార్కింగ్‌ చేయాలి.

Next Story