- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi Bonalu: హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు.. ఇండియా గేట్ వద్ద సందడి
దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు రెండో రోజు ధూంధాంగా జరిగాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Delhi Bonalu) దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు (Lal Darwaza Bonalu) రెండో రోజు ధూంధాంగా జరిగాయి. నిన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభమయిన లాల్ దర్వాజ బోనాల రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు ఇండియా గేట్ (India Gate) నుంచి తెలంగాణ భవన్ (Telangana Bhavan) వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో, సాంస్కృతిక నృత్యాల మధ్య అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా సింహవాహిని ఆలయ కమిటీ సభ్యులు ఇండియా గేట్ వద్ద అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం 150 మంది సాంస్కృతిక శాఖ కళాకారుల సంప్రదాయ పూర్వక డప్పుల మోతలు, పోతురాజుల ఆటలు, ఒగ్గుడోలు కళాకారుల నాట్యాలు, పూర్ణ కుంభాల మధ్య అమ్మవారి ఘటాల ఊరేగింపు సాగింది.
ఇండియా గేట్ వద్ద ఉన్న వివిధ రాష్ట్రాల ప్రజలతో పాటు అక్కడకు వచ్చిన విదేశీయులను సైతం తెలంగాణ సంస్కృతి విశేషంగా ఆకర్షించింది. పలువురు విదేశీయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ, బోనాల పండుగ వైభవాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో బంధించడమే కాదు, తెలంగాణ కళారూపాలపై ప్రశంసలు కురిపించారు. ఊరేగింపు అనంతరం తెలంగాణ భవన్‌లో ఘట స్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. తెలంగాణ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొనడం, కళాకారుల వాయిద్యాలతో కూడిన సాంస్కృతిక నృత్యాలు, పోతురాజుల ఆటలతో తెలంగాణ భవన్ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. రేపటితో ఢిల్లీలో (జూలై 2) ఈ వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ భవన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.






