- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లైవ్‌స్టాక్’ పథకానికి ఆదరణ కరువు.. ముందుకు రాని యువ రైతులు
గ్రామీణ ప్రాంతంలోని సన్న, చిన్నకారు రైతులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతంలోని సన్న, చిన్నకారు రైతులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ రైతులకు అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. స్థానిక వ్యవసాయ శాఖ, పశుసంవర్థకశాఖ అధికారులు ప్రచారం చేయకపోవడంతోనే నిజమైన రైతులు ఈ స్కీమ్‌లు పొందలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేంద్ర పథకాలకు ఎక్కువగా నిబంధనలు ఉండటంతో పాటు స్కీమ్ ఆలస్యంగా వస్తోందని.. అవగాహన ఉన్న యువరైతులు కూడా అప్లయ్ చేసుందుకు వెనకడుగు వేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నా ఆఫీసర్ల నిర్లక్ష్యంతో అమలుకావడం లేదనే ఆరోపణలున్నాయి.
స్కీమ్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అర్హులు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు గొర్రెలు, నాటు కోళ్లు, పందులు, పశుగ్రాసం పెంచడం ద్వారా ఉపాధి పొందేందుకు ‘నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్’ పథకం ప్రవేశపెట్టింది. నాలుగు రోజుల క్రితం పశుసంవర్థక శాఖ అధికారులు 81 మందికి గొర్రెల పెంపకం ప్రాజెక్టు మంజూరుకు కేంద్రానికి సిఫారసు చేశారు. ఒక్కొక్క పథకం వివరాలు పరిశీలిస్తే.. గొర్ల పెంపకం యూనిట్‌కు రూ. కోటి ఆర్థిక సాయం ఇస్తుండగా, ఒక యూనిట్‌లో 500 గొర్రెలు, 25 పొట్టేళ్లు ఉంటాయి. ఇందులో రూ.50 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుండగా, రూ.40 లక్షలు బ్యాంకుల నుంచి రుణం వస్తుండగా, రూ.10 లక్షలు లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. అదేవిధంగా పశుగ్రాసం పెంపకం యూనిట్‌కు రూ.కోటి ఇవ్వనుండగా, ఇందులోనూ 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. 1,000 నాటుకోళ్లు, 10 పుంజుల పెంపకం యూనిట్ విలువ రూ.50 లక్షలు ఉండగా, రూ.25 లక్షలు సబ్సిడీ, రూ.20 లక్షలు బ్యాంక్ రుణం, రూ.5 లక్షలు లబ్ధిదారుడు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. పందుల పెంపకం యూనిట్ ధర రూ.30 లక్షలు కాగా, రూ.15 లక్షలు రాయితీ రూ.12 లక్షలు బ్యాంక్ రుణం రూ.3 లక్షలు లబ్ధిదారు వాటాగా కట్టాలి. ఈ స్కీమ్‌లకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్‌కు పట్టా పాస్‌బుక్ తప్పనిసరి
ఆసక్తి ఉన్న రైతులు మీసేవ కేంద్రం ద్వారా నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకం, ఒక వేళ అద్దెకు తీసుకుంటే అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ అంగీకర పత్రం, యూనిట్‌కు చెందిన పూర్తి వివరాల రిపోర్ట్, ఈ రంగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందనేది తెలిపే సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు స్టేట్ ఇంప్లిమెంటేషన్ అథారిటీకి వెళ్తుంది. వారు అప్లికేషన్ పరిశీలన చేసి జిల్లా పశుసంవర్థక శాఖకు పంపిస్తారు. అధికారులు సంబంధిత గ్రామానికి వచ్చి భూమి, ఇతర సౌకర్యాలు ఉన్నాయో లేవో పరిశీలన చేసి డిపార్ట్‌మెంట్ యాప్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. వారు సూచించిన అర్హతలు ఉంటే నెల రోజుల్లో రాయితీ మంజూరు అవుతుంది.
గొర్రెల పెంపకానికి 240 దరఖాస్తులు
గత రెండు నెలల్లో గొర్రెల పంపకానికి 240 దరఖాస్తులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం అందులో 81 మందిని అర్హులుగా ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపింది. ఈ ప్రాజెక్టు ఈ నెలాఖరు నాటికి మంజూరు అవుతుందని, లబ్ధిదారులతో అధికారులు అవగాహన సమావేశం నిర్వహించాలని జిల్లా అధికారులకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు సూచించారు. అత్యధికంగా నాటు కోళ్ల పెంపకానికి 1,200, పశుగ్రాసం కోసం 450, పందుల పెంపకానికి 350 అప్లికేషన్లు వచ్చినట్టు సంబంధిత శాఖ అధికారులు చెప్పారు. గొర్రెల పెంపకానికి, పశుగ్రాసం పెంపకానికి ఐదెకరాల భూమి, బోరు మోటారు, చాప్‌కట్టర్, ఫీడర్ తప్పకుండా ఉండాలి. కోళ్ల పెంపకానికి రెండు నుంచి ఐదెకరాల భూమితో పాటు నీటి సదుపాయం ఉండాలని అధికారులు వెల్లడించారు.






