- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదోడికి ఒక రూలు.. ఉన్నోడికి ఒక రూలా? వక్ఫ్ భూముల విషయంలో అధికారుల ద్వంద్వ నీతి!
గజ్వేల్ పట్టణంలో వక్ఫ్ బోర్డు భూములకు రక్షణ లేకుండా పోయింది. పట్టణంలో సగానికి పైగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అక్రమార్కుల చేతిలో కబ్జాకు గురవుతున్నాయి.

దిశ, గజ్వేల్ రూరల్: గజ్వేల్ పట్టణంలో వక్ఫ్ బోర్డు భూములకు రక్షణ లేకుండా పోయింది. పట్టణంలో సగానికి పైగా ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అక్రమార్కుల చేతిలో కబ్జాకు గురవుతున్నాయి. దీంతో వక్ఫ్ భూముల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. వక్ఫ్ భూములలో అక్రమార్కుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వందల, వేల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా, అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాదారులు వాటిపై పాగా వేసి దర్జాగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. వక్ఫ్, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వక్ఫ్, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సైతం నామమాత్రంగా మారింది. ముఖ్యంగా పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డులో, 16వ వార్డులో, తూప్రాన్ రోడ్డులో వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వక్ఫ్ ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు గతంలో ఫిర్యాదులు అందినా కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అధికారుల వాటా ఎంత..? స్థానిక నాయకుల వాటా ఎంత..? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అక్రమార్కులు ముడుపుల రూపంలో అధికారులకు, నాయకులకు, విలేకరులకు సైతం గుట్టుచప్పుడు కాకుండా భారీగా నగదును ముట్టజెప్పుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
గజ్వేల్‌లో సగానికి పైగా వక్ఫ్ భూములే
గజ్వేల్ లో సగానికి పైగా వక్ఫ్ భూముల స్థలాలే ఉన్నాయి. సంగాపూర్ రోడ్డు నుంచి మొదలుపెడితే తుప్రాన్ రోడ్డు, జాలిగామ బైపాస్ రోడ్డు నుంచి జాలిగామ రోడ్డు వరకు దాదాపు చాలా ఏరియాల్లో సగానికి పైగా వక్ఫ్ భూములే ఉన్నాయి. స్థానిక నాయకుల అండదండలతో అక్రమార్కులు కొంత డబ్బులు ముట్టజెప్పి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. దీంతో వక్ఫ్ భూమాలను కాపాడే వారే లేకుండా పోయారు. గజ్వేల్ పట్టణ పరిధిలో దాదాపు 300 ఎకరాలకు పైగా వక్ఫ్ భూములు ఉన్నట్లు సమాచారం. అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపడుతుందటంతో అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన ఆయా శాఖల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
ఉన్నోళ్లకి ఒక రూల్.. లేనోళ్లకు ఒక రూలా..
వక్ఫ్ భూముల విషయంలో రూల్స్ ఎవరికైనా ఒకేలా ఉంటాయి, కానీ వాటి అమలులో తేడాలు ఉన్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎవరైనా పేదలు వక్ఫ్ భూములను కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులకు పిర్యాదులు అందిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని అదేవిదంగా పలుకుబడి ఉన్నవారు వక్ఫ్ భూములను కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపడితే పిర్యాదులు అందినా సరే అధికారులు అటువైపు చూసి చూడనట్లు వ్యవహారిస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పేదల అక్రమ నిర్మాణాలను ఎలాగైతే కూల్చేస్తారో పలుకుబడి ఉన్నవారి అక్రమ నిర్మాణాలను సైతం అలాగే కూల్చాలని చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లుగా అధికారులు నిరూపించాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టించుకోని టాస్క్‌పోర్స్..
అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను అరికట్టేందుకు 2019లో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీంను ప్రభుత్వం నియమించింది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక నాయకుల అండదండలు ఉండటం మూలంగానే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వక్ఫ్ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని వక్ఫ్ భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని పలువురు పేర్కొంటున్నారు.






