కార్మిక శక్తియే దేశానికి వెన్నెముక : కేంద్రమంత్రి మన్సుఖ్​ మాండవీయా

by Muthe.Rajitha |

దేశ వ్యాప్తంగా కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్​ వో దేవాలయమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయా పేర్కొన్నారు.

కార్మిక శక్తియే దేశానికి వెన్నెముక : కేంద్రమంత్రి మన్సుఖ్​ మాండవీయా
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్​వో దేవాలయమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయా పేర్కొన్నారు. ఈ దేవాలయం ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మరింత ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్​లో కార్యాలయాలకే రాకుండా డిజిటల్​ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు వివరించారు. గురువారం బేగంపేటలో ఈపీఎఫ్​ వో నూతన జోనల్​ కార్యాలయం ప్రారంభించి ప్రధాని మోదీ నేతృత్వంలో కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యధిక ఎక్కువ నిధులున్న సంస్థ ఈపీఎఫ్​వో అని, ఈ కార్యాలయాలకు వచ్చే కార్మికుల సమస్యలను, క్లైయిమ్​ లను త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్మికుల డబ్బుతో సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను జమ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ పనిచేసేవారైనా నేరుగా బ్యాంకుల నుంచే విత్​ డ్రా సౌకర్యాన్ని కల్పించామన్నారు. కార్మికుల సేవల కోసం 201 టోల్​ ఫ్రీ నెంబర్​ ను కూడా ప్రారంభించామని, భవిష్యత్​ లో 301 నెంబర్​ తో మరిన్ని సేవలను అందించేలా ప్రణాళిక రూపొందించి పనులు కొనసాగిస్తున్నామన్నారు.

యూఎఎన్​ నెంబర్​ ద్వారా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించినట్లే కార్మికులు సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో చిన్నచిన్న ఆటంకాలు, సమస్యలు అనేకం ఉండేవని ప్రస్తుతం వాటన్నింటినీ దశల వారీగా తొలగించామన్నారు. మరిన్ని సేవలను విస్తృతం చేసేందుకు మోదీ నేతృత్వంలో మెరుగైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్​ లో ఈపీఎఫ్​ వో లావాదేవీలు ఏటీఎం ద్వారా కూడా నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధికి వెన్నెముక కార్మిక శక్తియేనని పునరుద్ఘాటించారు. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పనివిధానంలో కూడా మార్పులను తీసుకువస్తున్నట్లు చెప్పారు. కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని విధాల సిద్ధంగా ఉండి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మూడు రోజుల్లోనే క్లైయిమ్​లకు పరిష్కారం : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

దేశంలోని కార్మికుల క్లైయిమ్​ లను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతుందని, దేశంలోనే సనత్​ నగర్​ ఈఎస్​ ఐ కార్మిక ఆసుపత్రి నెం.1గా నిలిచిందని ఇందుకు మంత్రి మన్సుఖ్​ మాండవీయాకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్మికులకు అస్యూర్డ్​ బెనిఫిట్స్​ రూ. 50 వేలు నిర్ణయించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో మరిన్ని ఆసుపత్రులు, ఈపీఎఫ్​ వోలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రామగుండం లాంటి చోట్ల స్థలాలు కేటాయిస్తే పనులను మొదలు పెడతామన్నారు. హైదరాబాద్​ మహానగరంలో ఈ–కామర్స్​ (అసంఘటిత రంగం)లో పనిచేసే లక్షలాది కార్మికులకు కూడా ఈపీఎఫ్​ వో ఫలాలను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తానని, అందుకు కేంద్రమంత్రి మాండవీయాకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కామర్స్​ రంగం ప్రస్తుతం దేశంలో దినదినం ప్రవర్థమానంగా ఎదుగుతుందన్నారు. ఆ రంగంలో ఉన్న కార్మికుల క్షేమాన్ని కూడా కోరుతున్నట్లు ఈపీఎఫ్​ వో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తూ సేవలను మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Next Story