వసూళ్లకు కేరాఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఆఫీస్..! ‘బీమా’ క్లెయిమ్‌కు భారీగా ముడుపులు?

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-28 02:26:06  IST  )

బీమా కంపెనీ ఉద్యోగులు సరికొత్త దోపిడీకి తెరలేపారు.

వసూళ్లకు కేరాఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఆఫీస్..! ‘బీమా’ క్లెయిమ్‌కు భారీగా ముడుపులు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీమా కంపెనీ ఉద్యోగులు సరికొత్త దోపిడీకి తెరలేపారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలనూ వదలడం లేదు. కార్మికుడి మరణం అనంతరం ప్రభుత్వం అందించే సాయాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి రూ.వేలు, లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న బాధిత కుటుంబం పట్ల కనీస మానవత్వం మరిచి లంచం ఇవ్వనిదే ప్రభుత్వ సాయం అందదంటూ తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో కార్మిక శాఖ అధికారులు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. కార్మిక శాఖ ప్రధాన కార్యాలయం వేదికగానే ఈ తతంగమంతా జరుగుతున్నది. అయితే, కంపెనీ ఉద్యోగులే ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నరా? లేక కంపెనీ యాజమాన్యమే ఇలా చేయాలని చెబుతుందా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో 12 లక్షల మందికిపైగా లేబర్ కార్డును కలిగి ఉన్నారు. వీరిలో ఎవరైనా సాధారణ మరణం (నార్మల్​డెత్-ఎన్‌డీ) జరిగితే రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే (యాక్సిడెంటల్​డెత్​-ఏడీ) కింద బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. ఇటీవల 3 నెలల క్రితం వరకు కార్మిక శాఖ ద్వారానే ఈ చెల్లింపులు జరిగేవి. బాధిత కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుని సరియైన ఆధారాలు సమర్పిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని ఇచ్చేవారు. ఇటీవల ఈ క్లెయిమ్‌లను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రైయల్​బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

రూ. వేల నుంచి లక్షల్లో డిమాండ్

ఆ కంపెనీ చనిపోయిన కార్మికుల వివరాలన్నింటిని పరిశీలించి ఆ కుటుంబ సభ్యులకు క్లైయిమ్​చెల్లిస్తుంది. అయితే, కంపెనీకి క్లైయిమ్‌ల అవకాశం ఇచ్చిన సందర్భంలోనే పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఆనాటి ఆరోపణలను నిజం చేస్తూ ఇన్సూరెన్స్​కంపెనీ ఉద్యోగులు చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి భారీ అవినీతికి తెరలేపారు. నార్మల్ డెత్ క్లెయిమ్​క్లియర్ కావాలంటే కనీసం రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు లంచంగా ఇవ్వాల్సి ఉంది. లేదంటే క్లైయిమ్‌ను క్లియర్ చేయరు. అదే ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం రూ.1.50 నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ససేమీరా అంటున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బీమా కంపెనీ ఉద్యోగులు బెదిరిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు.

కార్మికుల ఆగ్రహం..

ఈ ఇన్సూరెన్స్​కంపెనీకి కార్మిక శాఖ ప్రధాన కార్యాలయంలోనే స్థలాన్ని కేటాయించారు. క్లైయిమ్‌లకు సంబంధించి డాక్యుమెంట్స్‌ను అక్కడే సమర్పిస్తున్నారు. కార్మికశాఖ ప్రధాన కార్యాలయంలో కార్మికులకు, వారి కుటుంబాలకు సేవ చేయాల్సిన సంస్థ ఇలా బాధిత కుటుంబాలను వేధించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన కార్మికుడి కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఆ సాయాన్ని సదరు ఇన్సూరెన్స్​ సంస్థ దోపిడీ చేయడంపై ఫైర్ అవుతున్నారు.

ఈ పాపం ఎవరిది?

చనిపోయిన కార్మికుడి కుటుంబాల నుంచి లంచం డిమాండ్ చేస్తున్న పాపం ఉద్యోగులదే అయినా ఇటు కంపెనీకి విషయం తెలుసా? అనేది తేలాల్సి ఉన్నది. లేక కంపెనీకి తెలియకుండా ఉద్యోగులే వారి వ్యక్తిగత అవసరాల కోసం ఇలా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల వెనక ఇన్సూరెన్స్​కంపెనీ ఉందని, లేకుంటే ఉద్యోగులు కార్మిక శాఖ ప్రధాన కార్యాలయంలోనే ఇంత బరితెగించి డబ్బులు వసూలు చేస్తారా? ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సవాల్​చేసే పరిస్థితి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీ తీరు, అది విధించిన లక్ష్యాలను సాధించడంలో భాగంగానే ఉద్యోగులు కార్మికుల కుటుంబాల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ తతంగమంతా కంపెనీకి తెలిసే జరుగుతున్నదని బాధితులు చెబుతున్నారు. ఒక వేళ కంపెనీకి తెలియకుండా ఇదంతా జరిగితే వసూళ్లకు పాల్పడుతున్న ప్రతి ఉద్యోగిని తొలగించాలని వారు డిమాండ్​చేస్తున్నారు. లేదంటే కంపెనీకి కూడా అందులో భాగస్వామ్యం ఉందని భావించాల్సి ఉంటుందని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్​కంపెనీకి సాయం వస్తున్నా.. ఇలా చేయడాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. సదరు బీమా కంపెనీకి బాధ్యతలు అప్పగించి 3 నెలలు కాకముందే ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ఇక పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story