CPI: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, రద్దు చేయాలి.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హాట్ కామెంట్స్

by Ramesh Naini |

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

CPI: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, రద్దు చేయాలి.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ప్రజలపై భారం మోపే కాళేశ్వరం (Kaleshwaram project) ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాని నిర్వహణ కోసం ఏటా వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయోద్దని సూచించారు. శనివారం హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్‌లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నేడు నోరు మూసుకున్నారని, తన మెదడును కరిగించి డిజైన్ చేశానని, కాళేశ్వరాని అన్నీ నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు నాకు సంబంధం లేదంటున్నారని చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ బాధ్యత ఇంజనీర్‌లదే అని నేడు తప్పించుకుంటున్నారని, ఇది అన్యాయమన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదని, అందుకే కాళేశ్వరానికి మార్చామని, హరీశ్ రావు అంటున్నారని, అలా అని జనాలను ముంచే ప్రాజెక్టు కడతారా? అని ప్రశ్నించారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని మేము డిమాండ్ చేశామని, అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని జిల్లాలకు సాగునీరు అందేదని చెప్పారు. కాళేశ్వరం నిర్మించాక ఒక చుక్కనీరు అదనంగా ఇవ్వలేదని, నేడు పంటలకు వచ్చేవి ఎల్లంపల్లి నీళ్లేనని చెప్పారు.

కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్

కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను లేకుండా చేయాలని కలలు కంటున్నదని విమర్శించారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందని, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణమన్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే చట్ట ప్రకారం కేసులు పెట్టాలని, 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఒక ఫ్యూడల్, గూండా, ఫాసిస్ట్ పాలనకు నిదర్శనం అని అన్నారు. మావోయిస్టులు లొంగిపోతామన్నా, చర్చలకు సిద్ధం అని ప్రకటించినా హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ ఒక్క నంబాల కేశవరావును చంపితే దేశంలో కోట్లాది మంది స్పందించారని, అది కమ్యూనిస్టులకు ఉన్న మానవతావాదానికి నిదర్శనం అని అన్నారు.

Next Story