వేల కోట్ల ఎల్ఐసీ సొమ్ము అదానీకి ధారాదత్తం.. బీజేపీపై సీపీఐ కూనంనేని తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |   (  Updated:2025-10-27 12:04:07  IST  )

ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి ఎల్ఐసీ సొమ్మును బీజేపీ సర్కార్ దారాదత్తం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

వేల కోట్ల ఎల్ఐసీ సొమ్ము అదానీకి ధారాదత్తం.. బీజేపీపై సీపీఐ కూనంనేని తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త అదానీ(Adani)కి ఎల్ఐసీ (LIC) సొమ్మును బీజేపీ సర్కార్ దారాదత్తం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని మగ్ధూమ్ భవన్‌లో జరిగిన పార్టీ ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలు ఎల్ఐసీకి రూ. 33 వేల కోట్లు డిపాజిట్ చేస్తే అదానీ కంపెనీ సంక్షోభంలో ఉన్నదని, వారిని ఆదుకోవడం కోసం ఎల్ఐసీ వద్ద వేల కోట్ల పేద ప్రజల డబ్బులు మోడీ ప్రభుత్వం అదానీ కంపెనీకి ఇచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ పరిపాలనతో దేశం తిరోగమనానికి వెళ్లిందని, కేవలం ప్రసంగాలు, మాటలు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

100 ఏళ్ల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్మించిన పార్టీ సీపీఐ అని, తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదన్నారు. దున్నేవానికే భూమి నినాదంతో దొరల గడిలను బద్దలు కొట్టి, పేదవాడికి భూములు పంచిన చరిత్ర సీపీఐ దన్నారు. అధికారం లేకున్నా పేద ప్రజల పక్షాన నిలబడి వారి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నదని కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మం వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతాల ఉత్సవ ముగింపు సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని, ఇందుకోసం ప్రతి ప్రజా సంఘం నడుం బిగించాలని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా 40 కమ్యూనిస్టు దేశాల ప్రతినిధులు వస్తున్నారని, శతవసంతాల ముగింపు సభ వేదికగా కమ్యూనిస్టు పార్టీ మరింత పురోగమన దిశగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. 5 లక్షల మందితో జరగబోయే సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో జరిగే సీపీఐ జాతీయ శతాబ్ది ఉత్సవాల ముగింపు ఉత్సవాన్ని అట్టహాసంగా జరుపుకుందామని అన్నారు.

Next Story